రాహుల్ వచ్చినా కాంగ్రెస్ లో యువతకు మోడిచేయి !

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టగానే పార్టీలో సుదీర్ఘకాలంగా పెత్తనం చేస్తున్న వృద్ధ తరాన్ని పక్కన పెట్టి, యువతరానికి నాయకత్వం అప్పచెబుతారని చాలామంది ఆశించారు. గతంలో పలు రాష్ట్రాలలో యువ నేతలకు  ప్రోత్సహించిన రాహుల్ గాంధీ రాక సహజంగానే పార్టీలోని యువనేతలలో ఉత్సాహం కలిగించింది. 

అయితే పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టినా ఇంకా పార్టీలో వృద్ధ తరమే పెత్తనం చెలాయిస్తున్నారని స్పష్టం అవుతుంది. ఆ పార్టీ ఎంపిక చేస్తున్న ముఖ్యమంత్రులే అందుకు నిదర్శనం. బీజేపీలో వలే యువనేతలు కాంగ్రెస్ లో అవకాశం లభించడం లేదు. 

బిజెపి అధికారంలో ఉన్న చాల రాష్ట్రాలలో యువ నేతలకు ముఖ్యమంత్రి పదవులు లభించాయి. అత్యధికులు 60 సంవత్సరాలకన్నా తక్కువ వయస్సు ఉన్నవారే. మధ్య ప్రదేశ్ లో 13 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఈ మధ్య వరకు కొనసాగినా శివరాజ్ సింగ్ చౌహన్ వయస్సు ఇంకా 60 సంవత్సరాలకు  చేరుకోలేదు. '

ప్రస్తుతం ఉన్న నలుగురు ముఖ్యమంత్రుల వయస్సు 50 కన్నా తక్కువగా ఉండటం గమనార్హం. యోగి ఆడియనాథ్ (ఉత్తర ప్రదేశ్ ), దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర), పేమ ఖండూ (అరుణాచల్ ప్రదేశ్), విప్లబ్ కుమార్ దాస్ (త్రిపుర) ... అందరు 50 ఏళ్ళ వయస్సు కూడా నిండని వారే.

రఘుబర్ దాస్ (ఝార్ఖండ్) ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు 60 ఏళ్ళ వయస్సులో ఉన్నారు. కేవలం మనోహర్ పర్రికర్ (గోవా), మనోహర్ లాల్ ఖట్టార్ (హర్యానా) మాత్రమే 60 ఏళ్ళ పైబడిన వయస్సులో ముఖ్యమంత్రులు అయ్యారు. 

అయితే కాంగ్రెస్ లో పరిస్థితి భిన్నంగా ఉన్నది. తాజాగా మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా నియమితులైన వారంతా వృద్ధులే. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వయస్సు 72 కాగా, రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ వయస్సు 67 సంవత్సరాలు. ఇక చత్తీస్‌గఢ్ లో భూపేష్ బేగెల్ మాత్రమే మిగిలిన వారితో పోల్చుకొనే యువకుడు. 

అంతకు ముందు పంజాబ్ లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కెప్టెన్ అమరిందర్ సింగ్ వయస్సు 76 ఏళ్ళు కాగా, పుదుచ్చేరిలో 71 ఏళ్ళ వి నారాయణసామికి ముఖ్యమంత్రి పదవి లభించింది. 

చాలాకాలంగా, సచిన్ పైలట్ రాజస్థాన్ లో, జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లో కాబోయే ముఖ్యమంత్రులుగా ప్రచారం జరిగినా, వాస్తవానైకి వారినే ఎంపిక చేయాలనీ రాహుల్ గాంధీ భావించినా వృద్ధ నాయకత్వం వత్తిడికి  తలొగ్గక తప్పలేదు. వృద్ధ నాయకత్వాన్ని కాదని యువకులను ఎంపిక చేస్తే తన రాజకీయ భవిష్యత్ కు ఇబ్బందికరం కావచ్చని రాహుల్ నిర్ణయానికి వచ్చిన్నట్లు కనిపిస్తున్నది.