టిడిపి అవినీతిని ఎండగట్టేందుకే మోడీ రాక : కన్నా

 రాష్ట్రంలో టిడిపి అవినీతి పాలనను బట్టబయలు చేయడానికే వచ్చేనెల 6న బిజెపి నిర్వహించే ప్రజా చైతన్య సభకు ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్నారని ఆ  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్భ్రావృద్ధికి అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధిని సహకరిస్తున్న ప్రధాని మోదీ పర్యటనను టీడీపీ నాయకులు అడ్డుకోవాలని చూడటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

గుంటూరు సమీపంలోని బుడంపాడులో జనవరి 6వ తేదీన జరిగే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలతో కలిసి కన్నా పరిశీలిస్తూ మోదీ ప్రజాచైతన్య సభను విచ్చేస్తున్నారని, ఆయనకు రాష్ట్ర ప్రజల తరపున ఆహ్వానిస్తున్నామని తెలిపారు.  ‘ప్రజాచైతన్య సభ - సత్యమేవ జయతే’ పేరుతో నిర్వహించే ఈ సభ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. 

విభజన చట్టంలో హామీల అమలుకు పదేళ్ల గడువు ఉన్నా, ఐదు సంవత్సరాల్లోనే విజయవాడ ఫ్లై ఓవర్, ఇతర బ్రిడ్జిల నిర్మాణానికి ఇతోధికంగా కేంద్రం నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే గుంటూరు నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు ఇచ్చారని, రాజధాని, పోలవరం నిర్మాణానికి నూరుశాతం అడ్డంకులు తొలగించి 7 వేల కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి అందించిందని చెప్పారు. అలాగే మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం శరవేగంగా పూర్తవుతోందని వెల్లడించారు. 

గన్నవరం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కృషిచేసి అక్కడి నుండి ఇతర దేశాలకు కూడా విమాన సర్వీసులను నడిపేందుకు కృషిచేస్తున్న కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆ పార్టీ మంత్రులు, నేతలు దుష్ప్రచారం చేయడం వారి నైజాన్ని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మోదీ పర్యటనను గుంటూరులో విజయవంతం చేసి తీరుతామని కన్నా స్పష్టంచేశారు. 

గుంటూరు శివారు ఏటుకూరు బైపాస్‌ రోడ్డులో జరిగే బహిరంగ సభకు 13 జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరయ్యేలా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. రాష్ట్రాభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికొదిలి రాజకీయాలు చేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. అభివృద్ధిని కాంక్షించే ఎవరైనా మోదీని రాష్ట్రానికి ఆహ్వానిస్తారని స్పష్టం చేశారు.