యూపీ సచివాలయంలో వాజపేయి విగ్రహం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సచివాలయమైన లోక్‌భవన్‌లో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి 25 అడుగుల విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వాజపేయి 94వ జయంతిని పురస్కరించుకుని  కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ రామ్‌నాయక్ తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూపీతో వాజపేయికి ఎనలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు.

 వాజపేయి రాష్ట్రంలోని బలరాంపూర్ నుంచి రాజకీయాలకు శ్రీకారం చుట్టారని, లక్నో నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారని ఆయన చెప్పారు. సత్‌పరిపాలనకు బీజం వేసిన ఆయన పేరుపై ప్రస్తుతం దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలుపుతూ దీనదయాళ్ ఉపాధ్యాయ, శ్యాంప్రసాద్ ముఖర్జీల వద్ద నుంచి రాజకీయాలకు ఓనమాలు నేర్చుకుని తర్వాత రాజకీయాల్లో విశ్వసనీయమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారని ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సైనికుడిగా ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారని చెప్పారు. 

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రజాబాహుళ్యంలో ఎలా మెలగాలి, ఎలా జీవించాలో మనం ఆయన నుంచి నేర్చుకోవాలని సూచించారు. ఆయన కోపంలో సైతం ప్రేమను చూపించే మృదుస్వభావి అని, దౌత్యవేత్తగానే కాదు రాజకీయాల్లో యోధుడిగా నిలిచి విజయం సాధించారని తెలిపారు. యూపీ గవర్నర్ రామ్‌నాయక్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు, మదన్ మోహన్ మాలవ్య పుట్టిన రోజునే వాజపేయి సైతం జన్మించడం ఆహ్లాదకరమైన యాదృచ్ఛిక సంఘటన అని వ్యాఖ్యానించారు. 

రాజకీయాల్లో వాజపేయి మహానేతగా ప్రజల మనసును గెల్చుకున్నారని, విపక్షాలు సైతం ఆయన గొప్పదనాన్ని ప్రశంసించాయని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇక్కడ ఎంపీగా ఐదుసార్లు చేసినా ఆయనకంటూ సొంత ఇల్లు సైతం సమకూర్చుకోకపోవడం ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనమని ప్రశంసించారు.