అమరావతిలో శ్రీవారి ఆలయం

అమరావతి లోని దాదాపు 25 ఎకరాలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుమలలోని శ్రీ వారి ఆలయాని పోలిన విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సుమారు రూ 140 వ్యయంతో నిర్మించనున్నారు. తాము తయారు చేసిన ఆలయ నమునాను టిటిడి అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి చూపించారు. ఉండవల్లి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు.

ఆలయాన్ని అత్యంత వైభవంగా ఉండేలా నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆగమ శాస్త్రయుక్తంగా, పరమ పవిత్రంగా ఉండేలా ఆలయం రూపుదిద్దుకోవాలని, ఆధ్యాత్మికత ఉట్టిపడాలని స్పష్తం చేసారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు పరవశం చెందేలా ఉండాలని చెప్పారు. అదే సమయంలో ఆలయం వెలుపల భక్తులకు అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనీ సూచించారు.

రాతితో నిర్మించే ఈ ఆలయం అద్భుతంగా ఉండబోతోందని, రాజధానికే మకుటాయమానంగా ఉంటుందని టిటిడి అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రామాణికాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. చారిత్రాత్మకమైన చోళ, చాళుక్య, విజయనగర, పల్లవ నిర్మాణ శైలిని అనుకరిస్తూ ఈ ఆలయ నిర్మాణం అత్యంత శాస్త్రీయంగా చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలను భాగస్వామ్యులను కూడా చేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు.