బోగీబీల్‌ వంతెనను ప్రారంభించిన మోదీ

ఈశాన్య రాష్ట్రాలకు మరో మణిహారం అయిన బోగీబీల్‌ వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన ఇది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకుని నేడు ఈ వంతెనను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మించారు. రూ.5,920 కోట్లతో నిర్మించిన ఈ డబుల్‌ డెక్కర్‌ వంతెన వల్ల అసోంలోని తిన్‌సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్ల్‌గన్‌ పట్టణాల మధ్య దాదాపు 10 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. 500 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు దూరం తగ్గనుంది. 

ఇంజినీరింగ్‌ అద్భుతంగా పేర్కొనే ఈ బోగీబీల్‌ వంతెన రక్షణ పరమైన అవసరాలకూ, ఈశాన్య సరిహద్దు భద్రతా దళానికి చక్కని మౌలిక వసతిగా ఉపయోగపడనుంది. వంతెన కింది భాగంలో రెండు లైన్ల రైలు పట్టాలు, పై భాగంలో మూడు లైన్ల రహదారి ఉంటాయి. ఈశాన్య సరిహద్దుకు రక్షణ సామగ్రిని తరలించే అత్యంత భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా దీన్ని నిర్మించారు.

ఈ బోగీబీల్‌ వంతెన నిర్మాణానికి 1997లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ శంకుస్థాపన చేశారు. తర్వాత 2002లో ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నిర్మాణ పనులను ప్రారంభించారు. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చిన వంతెన నిర్మాణం.. శంకుస్థాపన చేసిన 21 ఏళ్లకు పూర్తయింది.