కాంగ్రెస్ కూటమి ఆశలకు మాయావతి, కేసీఆర్ గండి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక పక్షాలను ఏకంచేసి, ఒక కూటమిగా ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గండికొడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జరిగిన మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ తో సంబంధం లేకుండా సొంతంగా అభ్యర్థులను నిలఁగెత్తిన ఆమె, లోక్ సభ ఎన్నికలలో కూడా అటువంటి వ్యూహాన్నే అనుసరించడం కాంగ్రెస్ లో కలవరం కలిగిస్తున్నది. 

ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ తో సంబంధం లేకుండా అఖిలేష్ యాదవ్, అజిత్ సింగ్ లతో కలసి  కూటమిగా ఏర్పడి, సీట్ల సర్దుబాటుకు రంగం సిద్ధం చేశారు. మధ్య ప్రదేశ్ లో సహితం అన్ని సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు  బీఎస్పీ ఉపాధ్యక్షుడు రాంజీ గౌతమ్‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలలో సహితం ఆమె ఇటువంటి వ్యూహాన్నే అనుసరింపనున్నట్లు సంకేతం ఇస్తున్నారు. ఎన్నికల ముందే పొత్తు ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు ఆమె ఒప్పుకోవడం లేదు. 

గత వారం రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి బీఎస్పీ మద్దతు ఇచ్చినా కేవలం బిజెపిని అధికారమలోకి రాకుండా అడ్డుకోనేందుకే గాని, కాంగ్రెస్ తో కలసి అధికారం పంచుకునేందుకు కాదని మాయావతి స్పష్టం చేస్తున్నారు. దానితో మాయావతి ఎత్తుగడలు కాంగ్రెస్ కు అర్ధం కావడం లేదు. ఆమె అత్యధిక సీట్లలో పోటీ చేస్తే కాంగ్రెస్ ఓట్లు చీల్చే అవకాశం ఉన్నదని, దానితో బిజెపి లాభపడుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ రాకపోవడానికి బీఎస్పీ పెద్ద ఎత్తున పోటీ చేయడమే కారణం అని భావిస్తున్నారు. 

మరోవంక ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నాలు సహితం కాంగ్రెస్ కు ఆందోళన కలిగిస్స్తున్నాయి. కేవలం బిజెపికి వ్యతిరేకంగానే, దూరంగానే ఉన్న పక్షాల నేతలను మాత్రమే కలుస్తున్నారు. ఇప్పటికే నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ లను కలసిన ఆయన మాయావతి, అఖిలేష్ యాదవ్ లను కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 

కేసీఆర్ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించినా ఎక్కువగా నష్టపోయెడిది తామే అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ విధంగా చేయడం వల్లన బిజెపి వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పాడి బిజెపి ప్రయోజనం పొందుతుందని భయపడుతున్నారు. 

ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహితం కాంగ్రెస్ తో ఎటువంటి పొత్తు లేదని తేల్చి చెప్పేసారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుకు విముఖత వ్యక్తం చేశారు. దానితో కాంగ్రెస్ ఇప్పుటు సిపిఎంతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నది.