రూ 8 లక్షల మార్కెట్ కాపిటల్ లో రిలయన్స్

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో రూ 8 లక్షల కోట్ల మార్క్ ను అధిగమించిన తొలి పారిశ్రామిక సంస్థగా రికార్డు సాధించింది. ఎంక్యాప్‌లో ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ పోటా పోటీగా ఉంటాయి. కాగా ఆర్‌ఐఎల్‌ గురువారం రూ.8లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలిచింది.

భారత కంపెనీలలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8లక్షల కోట్లను చేరిన ఏకైక కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఘనత సాధించింది. గురువారం ట్రేడింగ్‌లో ఆర్‌ఐఎల్‌ షేర్లు 1.27శాతం లాభంతో రూ.1262.30 వద్ద ట్రేడయ్యాయి. దీంతో సంస్థ ఎంక్యాప్‌ రూ.8,00,001.54కు చేరింది. టీసీఎస్‌ ఎంక్యాప్ రూ.7,77,879కోట్ల వద్ద ఉంది.

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జులైలో రూ.7లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను దాటేసింది. మరో నెలరోజుల్లోనే మరో లక్ష కోట్లకు దాటటం గమనార్హం. దీంతో 2007 తర్వాత ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. అప్పటి వరకు ఆ స్థానంలో టీసీఎస్‌ ఉండగా దాన్ని వెనక్కి నెట్టేసింది.

తాజాగా రూ.8లక్షల కోట్ల ఎంక్యాప్‌ను కూడా చేరింది. గత నెల జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సమావేశంలో ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ 2025నాటికి ఆర్‌ఐఎల్‌ వ్యాపారం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 63శాతం పెరిగాయి. నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ షేర్లు లాభాలను నమోదు చేశాయి. షేరు విలువ 1.78శాతం లాభంతో రూ.1268.75గా ఉంది.