బిజెపి ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం


బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు 56 హామీలు నెరవేర్చనందుకే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

15 రోజుల్లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు. మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం నియోజవర్గానికి చెందిన పలు సమస్యల పరిష్కారానికై 3 నెలలుగా చంద్రబాబు చుట్టూ తిరుగతున్నా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు.

‘15 రోజుల్లోగా సీఎం స్పందించకపోతే 16వ రోజు నుంచి నిరాహారదీక్షకు దిగుతా. మీరు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని పంపిస్తున్నా. ఇలాంటి శాసనసభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా'అని పేర్కొన్నారు. 

తాడేపల్లి గూడెంలో  తెలుగుదేశం పార్టీ లేనందుకే ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. `నన్ను తొలగించి అయినా సరే  ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. నా రాజీనామాను మీరే స్పీకర్‌కు పంపించండి’ అని వాఖ్యానించారు.ముఖ్యమంత్రిని కోరారు. 

కూటమి కష్టాలు ఇలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేస్తూ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలతో ఇప్పటికే భేటీలు జరిపి ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఓ రూపు, ఊపు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంమీద రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు మహాకూటమి ఆశలు ఎంతమేరకు ఫలిస్తాయన్నది ఉత్కంఠగా మారింది.