జర్మనీలో రాహుల్ వాఖ్యలపై దుమారం

అభివృద్ధి ప్రక్రియలో గిరిజనులు, దళితులు, మైనారిటీలను విస్మరిస్తే ఐఎస్‌ వంటి ఉగ్ర సంస్థలు పుట్టుకొస్తాయని అంటూ కాంగ్రెస్ అద్యక్షులు జర్మనీలో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ పేర్కొనడం స్వదేశంలో రాజకీయ దుమారం రేపుతున్నది. విదేశీ భూమిలో, స్వదేశం గురించి చులకనగా మాట్లాడటం, పైగా ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ కు ఊతం ఇచ్చే విధంగా మాట్లాడటం పట్ల బిజెపి నేతలు మండిపడుతున్నారు. మోదీ ప్రభుత్వం అణగారిన వర్గాలను వృద్ధి ప్రక్రియలో విస్మరిస్తోందని, అభివృద్ధి ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేయకపోవడం ప్రమాదకరమని చెప్పడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని  నరేంద్ర మోదీ పాలనలో దేశ ద్రోహ చర్యలు, వేర్పాటు వాద కార్యకలాపాలకు కళ్లెం పడిందని.. కానీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఇవేవీ కనపడడం లేదని బిజెపి నేతలు ఎద్దేవా చేసారు. జర్మనీలో పర్యటిస్తోన్న రాహుల్‌ గాంధీ హాంబర్గ్‌లో మాట్లాడుతూ.. ఎన్డీఏ పాలనలో భారత్‌లో నిరుద్యోగం, అసమానతలు, మూక హత్యలు, దళితులపై దాడులు అధికమవుతున్నాయని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల వల్లే ఐఎస్‌ఐఎస్‌ వంటివి ఏర్పడుతాయని చెప్పారు.

 ‘రాహుల్‌ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లాజిక్‌ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 50 నెలల మోదీ పాలనలో దేశ ద్రోహ చర్యలు, వేర్పాటు వాద కార్యకలాపాలకు కళ్లెం పడింది’ అని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ వ్యాఖ్యానించారు.

“రాహుల్‌ దేశాన్ని చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సరికావు. ఆయన చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి” అని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా డిమాండ్ చేసారు. ఉద్యోగాలు రాకపోతే తమ మైనారిటీలు ఐఎస్‌కి అమ్ముడుపోతారన్నట్లు రాహుల్‌ చెప్పడం దేశంలోని మైనారిటీలను కించపర్చేలా ఉన్నాడని ద్వజమెత్తారు. ఆయన చెప్పిన మాటలు అన్నీ అసత్యాలే అంటూ సరైన సమాచారం లేకుండానే రాహుల్‌ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.