వాజ్‌పేయి స్మారకార్థం రూ.100 నాణెం విడుదల

మాజీ ప్రధానమంత్రి, బీజేపీ దిగ్గజం అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం ఆయన 94వ జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రూ.100 నాణెం విడుదల చేశారు. వాజ్‌పేయి జయంతి వేడుకలకు ఒకరోజు ముందే స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణేనికి ఓ వైపు వాజ్‌పేయి చిత్రంతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయన పేరును ముద్రించారు. 

జనన మరణ సంవత్సరాలను కూడా వాజ్‌పేయి చిత్రం కింద చూడొచ్చు. మరోవైపు అశోక చక్రం, సత్యమేవ జయతే నినాదం, రూ.100 అంకెతో పాటు భారతదేశం పేరును హిందీ, ఇంగ్లీషులో ముద్రించారు. ఈ నాణెం బరువు 35 గ్రాములు. 

దీన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ...‘‘అటల్‌జీ ఇక మనతో లేరన్న విషయాన్ని నమ్మేందుకు మనసు అంగీకరించడం లేదు. సమాజంలోని అన్ని వర్గాలనుంచి ప్రేమాభిమానాలు అందుకున్న అరుదైన నాయకుడాయన..’’ అని పేర్కొన్నారు.  ఇప్పుడు కొందరు నేతలు ఐదేళ్లు అధికారానికి దూరమైనా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారనీ... వాజ్‌పేయి ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన తన గళం వినిపించారని గుర్తు చేశారు. 

 ‘‘ప్రజాస్వామ్యమే సర్వోన్నతంగా ఉండాలని వాజ్‌పేయి భావించారు. ఆయన మొదట జన సంఘ్‌ను స్థాపించినప్పటికీ... ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు జనతా పార్టీలో చేరారు. అలాగే అధికారమా, సిద్ధాంతమా అనేది తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు... జనతా పార్టీని కూడా వదిలేసి బీజేపీని స్థాపించారు...’’ అని ప్రధాని పేర్కొన్నారు.

అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1996లో 13 రోజుల పాటు, 1998లో 13 నెలల పాటు రెండుసార్లు కొద్ది కాలమే ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి.. 1999 నుంచి మూడోసారి దాదాపు ఆరేళ్లపాటు ప్రధానిగా సేవలు అందించారు. కాగా ప్రతియేటా భారత ప్రభుత్వం వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబర్ 25న సుపరిపాలన దినోత్సవంగా జరుపుతున్న సంగతి తెలిసిందే.

 దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, వాజ్‌పేయీ సన్నిహితుడు ఎల్‌కే అడ్వాణీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, బిజెపి  జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు.