అత్యధిక అసత్యాలు ఆడిన నేతలు రాహుల్, కేజ్రీవాల్

భారత  రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక అసత్యాలు ఆడిన నేతలుగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిలిచారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. దిల్లీలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘ప్రధాని మోదీని గెలిపించి మళ్లీ అధికారంలో కూర్చోబెట్టాలని కోరడానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో దిల్లీలో ప్రధానంగా బిజెపి, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంటుంది.

రానున్న లోక్‌సభ ఎన్నికలు సామాన్యమైన ఎన్నికలు కాదని, కుల, మత, పక్షపాత ధోరణితో చేసే రాజకీయాలకు ముగింపు పలుకుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం విఫలమైందని అంటూ వారు నెరవేర్చని ఆ హామీల జాబితాయే ఆ ప్రభుత్వ వైఫల్యాల జాబితా అని విమర్శించారు.

 దిల్లీలోని ప్రజలకు మంచి నీటి సౌకర్యం సరిగ్గా అందట్లేదని, దిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) బస్సుల్లో సీసీ కెమెరాలను, భద్రత కోసం మార్షల్స్‌ను ఉంచుతామని ఇచ్చిన హామీను నెరవేర్చలేదని గుర్తు చేశారు. అలాగే, 500 కొత్త పాఠశాలలను ప్రారంభిస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదని అంటూ దిల్లీ ప్రజలు ఆప్‌ ప్రభుత్వం వల్ల కష్టాల పాలు అవుతున్నారని పేర్కొన్నారు. కానీ, కేజ్రీవాల్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవట్లేదని అమిత్‌ షా విమర్శించారు. 

కుంభకోణాల్లో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులోనూ కాంగ్రెస్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. ‘బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? కాంగ్రెస్‌ వల్లే ఆ అల్లర్లు జరిగాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటైంది. ఈ కేసులో విచారణ వేగంగా జరిగింది. బాధితులకు న్యాయం జరిగింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.