ఎన్టీఆర్‌ ఆశయాలకు తిలోదకాలిచ్చిన చంద్రబాబు

కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించగా ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌తోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బాబును ఎన్నటికీ క్షమించరని ఆయన విమర్శించారు. ‘నా పోలింగ్‌ బూత్‌ బలమైన పోలింగ్‌ బూత్‌’ పేరిట ప్రధాని మోదీ ఇటీవల పార్టీ బూత్‌ కమిటీల సభ్యులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ ఉండటం తెలిసిందే.

పార్టీ నేత ఒకరు వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందని ప్రశ్నించగా మోదీ సమాధానమిస్తూ బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే వారితోనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ కూడా అపోహలకు గురి కావద్దన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి విజయం సాధించారని ప్రధాని గుర్తు చేయసారు. అయితే, ఎన్టీఆర్‌ ఆశయాలకు నీళ్లొదిలి కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకున్న ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆంధ్ర ప్రదేశ్  ప్రజలు క్షమించబోరని స్పష్టం చేశారు. అలాంటి అనైతిక పొత్తులకు బీజేపీ పాకులాడబోదని కార్యకర్తలకు హమీ ఇచ్చారు.

 ‘‘నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్యమంత్రిని కాంగ్రెస్‌ అవమానించింది. అందువల్ల ఆ పార్టీ దురహంకారానికి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించారు. అదే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉండాలనుకుంటోంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎలా ఆమోదిస్తారు’’ అని ప్రశ్నించారు.  

ఇటీవల మహా కూటమి అంటూ మాట్లాడుతున్న పార్టీల నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్‌ పోకడలతో భంగడిన వారేనని ప్రధాని పేర్కొన్నారు. సోషలిస్ట్‌ నేత రామ్‌ మనోహర్‌ లోహియానే తమకు ఆదర్శమని చెప్పుకుంటున్న ఈ నేతలు.. పార్టీ సిద్ధాంతాలు, జాతిహితంపై రాజీపడే పార్టీగా కాంగ్రెస్‌ను ఆయన తిట్టిపోసేవారని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.

కాంగ్రెస్‌ను రాజీ పార్టీ (కాంప్రమైజ్‌ పార్టీ)గా లోహియా అభివర్ణించేవారన్నారు. ఆ పార్టీ అనేక సైద్ధాంతిక అంశాలు, జాతీయ ప్రయోజనాలపై రాజీ పడిందని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ఆ కూటమిలోని అనేక మంది నేతలను అరెస్టు చేసి, చిత్రహింసలపాల్జేశారని పేర్కొన్నారు. ఇలాంటి పార్టీల పాలనలో అవినీతిపరులు, నేరగాళ్లదే పైచేయిగా ఉంటుందన్నారు.

 ‘‘సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ను కాంగ్రెస్‌ ఎలా వేధించిందో మనకు తెలుసు. 1980లో తమిళనాడులో ఎంజీఆర్‌ నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసింది. కాంగ్రెస్‌కు, డీఎంకేకు మధ్య తీవ్ర వైరం ఉండేది. నేడు ఆ రెండు పార్టీలూ కలసిపోయాయి. అది అవకాశవాదమే’’ అని పేర్కొన్నారు. దిగ్గజాలైన ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌లను కాంగ్రెస్‌ అవమానించిందని చెప్పారు. దానిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. ప్రాంతీయ పార్టీల అణచివేతకే కాంగ్రెస్‌ ప్రయత్నించిందన్నారు.  

 వామపక్షాలపైనా మోదీ మండిపడ్డారు. కొన్నేళ్ల కిందట వారు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారన్నారు. ఆ పార్టీని సామ్రాజ్యవాద అనుకూల పార్టీగా ముద్ర వేశారని, ధరల పెరుగుదలకు, వ్యవసాయ సంక్షోభానికి కారణంగా అభివర్ణించారని చెప్పారు. నేడు ఆ పార్టీలు పరస్పరం పొగుడుకుంటున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత ఆధారంగా ఏర్పడ్డ ఎన్‌సీపీ కూడా ఈ కూటమిలో చేరడంపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.