జీఎస్‌టీ తగ్గింపు వ్యతిరేకించిన కాంగ్రెస్, ప్రతిపక్షాలు

విలాస వస్తువులకు మినహా దాదాపు అన్నింటికీ  జీఎస్‌టీ  స్లాబ్ లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంటే అదంతా తమ ఘనకార్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ లు ఇచ్చారు. తాము వత్తిడి చేయబట్టే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చినదని అంటూ డాబు పలికారు. అయితే వాస్తవానికి ఈ విధంగా  జీఎస్‌టీ  తగ్గించే ప్రతిపాదనలను కాంగ్రెస్ ప్రభుత్వాలు, వాటికి తోడుగా ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 

 వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గింపును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన జీఎస్‌టీ మండలి 31వ సమావేశంలో కొన్ని వస్తువులపై జీఎస్‌టీని తగ్గించేందుకు ప్రతిపాదనలు వినిపించినపుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు విశ్వసనీయ సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ, పుదుచ్చేరి జీఎస్‌టీ తగ్గింపును వ్యతిరేకించారు.

ఫిట్‌మెంట్ కమిటీ ఏ వస్తువును ఏ పన్ను రేటు పరిథిలో ఉంచాలో నిర్ణయించేందుకు అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ శనివారం జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో తన ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. దీంతో కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ నిరసన వ్యక్తం చేశారు. ఏ వస్తువుపైనా పన్ను తగ్గించరాదని, పన్ను తగ్గించేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు. 

ఆయనకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రులు మద్దతు పలికారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత కూడా ఐజాక్ వాదనకు మద్దతిచ్చారు. అయితే పంజాబ్ ఆర్థిక మంత్రి తటస్థంగా వ్యవహరించారు.

శనివారం జరిగిన జీఎస్‌టీ మండలి 31వ సమావేశంలో కేవలం విలాస వస్తువులను మాత్రమే అత్యధిక జీఎస్‌టీ రేటు 28 శాతం పరిథిలో ఉంచారు. మిగిలినవాటిపై పన్ను రేటును తగ్గించిన సంగతి తెలిసిందే.