పాకిస్తాన్ కాదు టెర్రరిస్తాన్

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ‘పాకిస్తాన్ కాదు టెర్రరిస్తాన్’ అంటూ బీజేపీ నేత సంబిత్ పాత్ర విమర్శించారు. మానవత్వం గురించి పాక్ నుంచి ఇండియా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు.

ముంబై 9/11 దాడి ఉగ్రవాదులకు పాల్పడింది పాకిస్తాన్ ఉగ్రవాదులేనని, అలాంటి వారిని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని దుయ్యబట్టారు. తీవ్రవాద సంస్థ తాలిబన్‌తో పాకిస్తాన్‌కు స్నేహం ఉన్న మాట వాస్తవం కాదా అని సంబిత్ పాత్రా ప్రశ్నించారు. పాకిస్తాన్ అంటే టెర్రరిజమని, వాస్తవానికి దాని పేరు కూడా టెర్రరిస్తానేనని ఆయన అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌లో లాగా ఇండియాలో ఒకే మతానికి చెందిన వ్యక్తులు దేశాన్ని పాలించాలని రాజ్యాంగంలో లేదని ఓవైసీ అన్నారు. ఇండియాలో భిన్న వర్గాల నుంచి ప్రధానిగా చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగం ఆ విధంగా వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు.

‘ఇండియాలో మైనారిటీలపై అసహనం విపరీతంగా ఉంది. మహ్మద్ అలీ జిన్నా దీనిని గుర్తించే ముస్లింల కోసం పాకిస్తాన్‌ను ఏర్పాటు చేశారు’’ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.