వివక్షాల మహాకూటమి ఓ 'రాజవంశీకుల క్లబ్'

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఏర్పాటవుతున్న విపక్షాల 'మహాకూటమి'పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. అదో 'రాజవంశీకుల క్లబ్' అంటూ అభివర్ణించారు. వ్యక్తిగత ప్రయోజనాల పరిరకక్షణ కోసం కొందరు నేతలు 'మహాకూటమి'గా ఏర్పడుతున్నారని, ఇలాంటి అవకాశవాదుల ప్రయత్నాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారని ధ్వజమెత్తారు.. మహాకూటమి ఓ ‘అపవిత్ర కూటమి’ అని ఎద్దేవా చేశారు. అలాంటి సమన్వయం లేని కూటమిని ప్రజలు ఎప్పుడూ అంగీకరించరని స్పష్టం చేశారు. 

చెన్నై సెంట్రల్, నార్త్ చెన్నై, మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరులోని బూత్ లెవెల్ కార్యకర్తలతో మోదీ ఆదివారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ  'మహాకూటమి గురించి పలువురు నేతలు మాట్లాడుతున్నారు. అవన్నీ తమను తాము కాపాడుకునే ప్రయత్నాలే. ఎలాంటి సిద్ధాంతాల ప్రాతిపదిక లేదు. అధికారమే వారి పరమావధి. ప్రజా సంక్షేమం ఎంత మాత్రం కాదు' అని మోదీ పేర్కొన్నారు. 

ఓ వైపు దేశాభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతుంటే, మరోవైపు ప్రజలను తప్పుదోవ పట్టించే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏ అవకాశాన్నీ వదలడం లేదని విమర్శించారు.  జైన్ కమిషన్‌ విషయంలో కాంగ్రెస్, డీఎంకే వైఖరి ఏమిటో అందరికీ తెలిసిందనీ, ఇప్పుడు ఆ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకోవడం అవకాశవాదం కాదని ఎలా చెప్పగలం? అని మోదీ ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని, దేశం సాధిస్తున్న అభివృద్ధిపై ప్రజలను తప్పుపట్టించేందుకు ఆ పార్టీ వెనుకాడటం లేదని ఆరోపించారు.

 తమ ప్రభుత్వం దేశంలో చాలా అభివృద్ధి పనులను చేసిందని మోదీ అన్నారు. ‘పట్టణీకరణ అనేది నేను ఓ సవాలుగా భావించడం లేదు. మాకు లభించిన ఓ అవకాశంగా భావిస్తున్నాను. మా ప్రయత్నాలు గొప్ప ఫలితాలనిస్తున్నాయి. అలాగే, ఈ ఏడాది ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. న్యూ ఇండియా నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది చాలా కార్యక్రమాలను ప్రారంభించామని పేర్కొన్నారు. 

బీజేపీ కార్యకర్తలందరూ మన మాతృభూమి గొప్పదనం పట్ల గౌరవాన్ని నింపుకొని, ప్రజలతో మమేకం కావాలి. పేద ప్రజల వైపున నిలబడాలని ప్రధాని పిలుపిచ్చారు. అప్పుడే రానున్న ఎన్నికల్లో మన పార్టీ విజయం మరింత సులువు అవుతుందని మోదీ భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని సూచించారు.

2019 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని, కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకుని తద్వారా యువతకు మరింత చేరువకావాలని చెప్పారు. బూత్ కార్యకర్తలే పార్టీకి ఆత్మ, పార్టీకి జీవం అని కొనియాడారు. ఇటుక ఇటుకా పేర్చి పార్టీని కొత్త పుంతలు తొక్కించాలంటూ దిశానిర్దేశం చేశారు.