బీహార్ లో ఎన్డీఏ సీట్ల సర్దుబాట్లు పూర్తి

 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీహార్ లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సీట్ల పంపకాలను పూర్తి చేసుకున్నాయి.  భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఇంట్లో ఆదివారం సమావేశమై ఈ విషయమై ఒక అవగాహనకు వచ్చారు. 

బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌, లోక్‌జన శక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత రామ్‌ విలాస్‌ పాసవాన్‌ ల సమక్షంలో తాము పోటీ చేయబోయే సీట్ల వివరాలను అమిత్ షా ప్రకటించారు. ‘బిహార్‌లో బిజెపి  17, జేడీయూ 17, ఎల్‌జేపీ 6 సీట్లలో పోటీ చేస్తాయి’ అని  ఈ సందర్భంగా అమిత్ షా  ప్రకటన చేశారు. అలాగే, ఎల్‌జేపీ అధినేత, కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌‌కు త్వరలో రాజ్యసభ సీటు ఇస్తామని ఆయన తెలిపారు. 

బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.  2014 ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగా పోటీ చేసి రెండు సీట్లను మాత్రమే గెలుపొందింది. బిజెపి మాత్రం ఎల్‌జేపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగిది. 

మొన్నటి వరకు ఎన్డీయేలో కలసి ఉన్న  ఆర్‌ఎల్‌ఎస్‌పీ నేత ఉపేంద్ర కుష్వాహా  ఈ వారమే యుపిఎలో చేరడం తెలిసిందే. సీట్ల విషయంపై రెండు రోజులుగా బీజేపీ నేతలు ఒక వంక నితీష్ కుమార్ తో, మరో వంక రామ్ విలాస్ పాశ్వాన్ తో సమాలోచనలు జరుపుతున్నారు. 

 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఎన్డీఏ 31 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 30 స్థానాల్లో పోటీ చేసి 22 స్థానాల్లో గెలుపొందగా, ఎల్‌జేపీ 6 స్థానాల్లో, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ 3 సీట్లు గెలుచుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన జేడీయూ ఆ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది.

2014 కన్నా ఈ పర్యాయం ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని ఈ సందర్భంగా అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు.