గుజరాత్ ఉపఎన్నికల్లో బిజెపి ఘన విజయం.. 100 సీట్లకు బిజెపి బలం

గుజరాత్ లో జాసదన్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కున్వర్జ్ బావలియా కాంగ్రెస్ అభ్యర్థి అవసర నాకియాపై 19,985 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. దీనితో గత డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలలో 99 సీట్లు గెలుచుకొన్న బీజేపీ బలం రాష్ట్ర శాసన సభలో 100 సీట్లకు పెరిగింది. 

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుండి గెలుపొందిన బావలియా గత జులైలో బిజెపిలో చేరి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. గత ఎన్నికలో కూడా 19 వేల ఆధిక్యతతో గెలుపొందడం గమనార్హం. ఐదు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొందిన ఆయనకు ఈ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉంది. ప్రస్తుతం మంత్రిగా కీలకమైన గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధకం, గ్రామీణ గృహ నిర్మాణ శాఖలను నిర్వహిస్తున్నారు. 

ఈ సీట్ ను ఎట్లాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో బిజెపిని ఓడించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈ సీట్ సునాయనంగా గెల్చుకోగలననే ధీమాతో ఉంటూ వచ్చింది. డిసెంబర్ 20న జరిగిన పోలింగ్ లో 71.27 శాతం ఓట్లు పోలయ్యాయి. 

ఎన్నికల ప్రచారం చివరి రోజున నియోజకవర్గంలో రాష్ట్ర అధ్యక్షుడు జీజూ వాఘాని  నేతృత్వంలో బిజెపి 36-కి మీ మోటార్ బైక్ ర్యాలీ జరిపింది. ఎన్నికల ప్రచారంలో బిజెపి అగ్రనేతలు, ,ముఖ్యమంత్రి విజయ రూపాని ఎవ్వరు పాల్గొనలేదు. అయితే ముఖ్యమంత్రి భార్య అంజలి రూపాని మాత్రం ప్రచారం చేశారు.