తిరిగి విధులలో చేరిన జైట్లీ

కిడ్ని మార్పిడితో నాలుగున్నర నెలలుగా విధులకు దూరంగా ఉంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తిరిగి గురువారం విధులు చేపట్టారు. ఏప్రిల్ ప్రారంభం నుండి ఇంటికే పరిమితమై ఉంటున్న ఆయనకు తిరిగి ఆర్ధిక కార్పోరేట్ శాఖలను కేటాయిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సలహాపై రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఉత్తరువులు జారీ చేసారు.

ఆయన విధులకు దూరంగా ఉన్న సమయంలో తాత్కాలికంగా ఆ శాఖను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ కు కేటాయించారు. ఇంటినుండే ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ తర్వాత అందుబాటులో ఉంటూ వచ్చారు. వర్తమాన రాజకీయ, ఆర్ధిక అంశాలపై తన బ్లాగ్ లో వ్యాసాలు వ్రాస్తూ రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు.

ఆపరేషన్‌ తర్వాత తొలిసారి జైట్లీ ఈ నెల తొమ్మిదిన జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్నారు. గురువారం ఉదయం సెంట్రల్ సెక్రటేరియట్‌లోని నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి వచ్చిన జైట్లీకి తిరిగి ఆర్థికమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. జైట్లీకి ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఆయన కార్యాలయాన్ని రినోవేట్ చేశారు. ఆయన రాజ్యసభలో సభా నాయకుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.