అంతర్మథనంలో తెలంగాణ బీజేపీ

ముందెన్నడూ లేని విధంగా ఎంతో విస్తృతంగా ప్రచారం చేసి, విపక్షాలను ధీటుగా ఎదుర్కొని రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగయడం కోసం పెద్ద ఎత్తున కృషి చేసిన తెలంగాణ లోని బీజేపీ నేతలకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మింగుడు పడటం లేదు. రెండంకెల సంఖ్యలో సీట్లు గెల్చుకొంటామని ధీమాతో ఉన్నప్పటికీ కేవలం ఒక సీట్ తో సరిపెట్టుకోవడం మింగుడు పడటం లేదు. పెద్దగా పోటీయే లేదనుకున్న పార్టీ సీనియర్ నేతలు జి కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్ వంటి వారు ఓటమి చెందడాన్ని జీరించుకోలేక పోతున్నారు. 

ఈ విషయమై రాష్టంలోని బిజెపి నేతలు అంతర్మథనం ప్రారంభించారు. శనివారం నిర్వహించిన కోర్ కమిటీ భేటీకి పార్టీలో ప్రాధమికంగా సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర పోషించిన  జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, జీ కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు తదితర నేతలు పాల్గొన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను అన్వేషిస్తూనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా కూడా  కోర్ కమిటీ  దృష్టి సారించింది. ఒక్క నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ తన ఉనికిని చాటుకోవడంపై పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలు ప్రధానంగా టీఆర్‌ఎస్- మహాకూటమి మధ్య ద్విముఖ పోటీగా మారిపోవడంతో బీజేపీ పాత్ర నామమాత్రం అయిపోయిందని అభిప్రాయానికి వచ్చారు. 

 అలాగే కేంద్రప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నా, ఆ పథకాలను రాష్ట్రప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని, అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకోవడంతో సామాన్యులకు కేంద్ర పథకాల ఉనికి తెలియకుండా పోయిందని కూడా కోర్ కమిటీ అభిప్రాయపడింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మందీ మార్బాలాన్ని దించడమేగాక, విపరీతంగా డబ్బు ఖర్చు చేసిందని, అడ్డూ అదుపూ లేకుండా పోయిందని దాని ప్రభావం కూడా ఎన్నికలపై పడిందని కమిటీ పేర్కొంది.

 రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఓటర్ల లిస్టుల్లోనూ బీజేపీ కార్యకర్తలు, అనుకూలవర్గం పేర్లను ఆఖరి నిమిషంలో తొలగించడం కూడా జరిగిందని కమిటీ దృష్టికి వచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 24 మంది కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీ, ఇటీవలె బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద అంతా కలిసి ఎడతెరపి లేకుండా 200కు పైగా సభల్లో పాల్గొన్నా అనుకున్న ఫలితాలు రాకపోవడం నిరాశకు గురిచేసినా ఉధృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన ప్రజా బలం ఎక్కడకు పోలేదనే అభిప్రాయానికి వచ్చారు. 

‘‘ఒక్క స్థానానికే పరిమితం అవుతామని ఊహించలేదు. తెరాస, భాజపా ఒక్కటే అన్న భావన ప్రజల్లో నెలకొంది. ఈ అభిప్రాయాన్ని మార్చడంలో విఫలమయ్యాం. ఎన్నికలు తెరాస, కాంగ్రెస్‌ మధ్య అన్నట్లుగా ప్రజలు భావించడం కూడా ఓట్లు రాకపోవడానికి మరో కారణం. లక్షల ఓట్ల గల్లంతు తీవ్ర ప్రభావమే చూపింది. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. కేంద్ర పథకాలను సొంత పథకాలుగా తెరాస ప్రచారం చేసుకుంటోందన్న అంశాన్ని ప్రజలకు వివరించలేకపోయాం. ఇవన్నీ ఓటమికి కారణాలేనని’’ భావిస్తున్నట్లు ఒక నేత చెప్పారు. ఈ లోపాలను లోక్‌సభ ఎన్నికల నాటికి సరిదిద్దుకోవాలని నిర్ణయించారు. 

 రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, కొంత మేరకు అధికార పార్టీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ విజయాన్ని గండికొట్టాయి. ఎన్నికల్లో ప్రచారంలోనూ, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ, సభల నిర్వహణ, సమన్వయంలో ఎలాంటి లోపాలు జరగపోయినా, రాజకీయ కారణాలు పార్టీ పరాజయంపై ప్రభావం చూపాయనే భావన వ్యక్తం అయింది.