విచ్ఛిన్నకర శక్తులపై ఉక్కుపాదం : మోదీ పిలుపు

సమాజాన్ని కులాలు, మతాల పేరుతో విభజించి రాజకీయంగా లబ్ధిపొందాలనే శక్తులపై భద్రతా ఏజన్సీలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ దేశానికి ఈ శక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. దేశాన్ని తీవ్రవాదంతో విచ్ఛిన్నం చేయాలనే చీకటి శక్తులు, సంస్థలపై నిఘా పెట్టాలని ఆయన పోలీసులను కోరారు. 

దేశమంతా ఒక్కటే అనే సమభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పోలీసులను కోరారు. గుజరాత్‌లోని కవాడియాలో జరిగిన డీజీపీ, ఐజీల వార్షిక సదస్సులో ఆయన ప్రసంగిస్తూ దేశ సమగ్రత, ఐక్యత కోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన పిలుపిచ్చారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా పని చేయాలనే సంకల్పంతో పోలీసుశాఖ పనిచేయాలని పేర్కొన్నారు. 

ఈ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు అన్ని రకాల దుష్టపన్నాగాలతో ఉండే శక్తులను ఒక కంట కనిపెట్టి ఉండాలని హితవు చెప్పారు. ఈ శక్తులను గుర్తించి ఏకాకులను చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నడ్డివిరిచేందుకు పోలీసు శాఖ చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు.

జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదులను ఎదుర్కొనడంలో పోలీసులు పోషిస్తున్న పాత్రకు భారతీయులు గర్విస్తున్నారని మోదీ చెప్పారు. ఉగ్రవాదులను విజయవంతంగా నిరోధించగలగడం భారతీయులకు గర్వకారణమని పేర్కొన్నారు. అన్ని అంశాలను జాతీయ దృక్పథంతో చూస్తున్నందుకు పోలీసు అధికారులను ప్రశంసించారు. 

కొద్ది సంవత్సరాలుగా ఈ వార్షిక సమావేశపు స్వభావం మారుతుండటం గొప్ప విజయమని చెప్పారు. దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక అంశాలపై అతివాద ధోరణులను ప్రేరేపించేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశంలోని అన్ని వర్గాలవారి మధ్య పరస్పర విశ్వాసాన్ని ప్రోత్సహించాలని సూచించారు. 

నేరాలను నియంత్రించడంలో అంతర్రాష్ట్ర సమన్వయం చాలా ముఖ్యమని తెలిపారు. విభజనవాదులు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కులాల మధ్య వ్యత్యాసాలను ఉపయోగించుకుంటున్నారన్నారు. సమైక్యతను ప్రోత్సహించే శక్తులను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. విభజనవాదులను ఒంటరివాళ్ళుగా చేయాలన్నారు.

పోలీసులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. ప్రజల సంక్షేమం, భద్రత లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసుల త్యాగాలను గుర్తించాలని ఆయన సీనియర్ పోలీసు అధికారులను కోరారు. ఒక్కోసారి పోలీసులకు వారు చేసిన కృషికి తగిన గుర్తింపు లభించదని చెబుతూ ఆ లోటు రానివ్వకుండా చూడాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా దేశ విచ్ఛిన్నకరశక్తులపై నిఘా పెట్టాలని చెప్పారు. 

సైబర్ సెక్యూరిటీ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ అంశాలపై పోలీసులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.  ఈ సందర్భంగా ఆయన విశిష్టసేవలు అందించిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు రాష్టప్రతి పతకాలను అందచేశారు. జాతీయ పోలీసు స్మారకోత్సవ సందర్భంగా పోలీసుల సేవలను గుర్తిస్తూ ఒక తపాలా బిళ్లను ఆయన విడుదల చేశారు. పోలీసు స్మారక స్థూపం ప్రజలకు స్ఫూర్తినిస్తోందని చెప్పారు. సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు.