మహిళలకు ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదే

దేశాన్ని 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ.. మహిళలకు ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదని, మహిళా సంక్షేమం విషయంలో విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. 

శనివారం గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా సమావేశంలో మాట్లాడుతూ... ‘మహిళలకు భద్రత కల్పించే విషయంలో మేము చర్యలు తీసుకుంటున్నాం. వివక్ష నుంచి వారు స్వేచ్ఛను పొందడానికి కృషి చేశాం. కొందరు అతివాదుల, ప్రతిపక్షాల నుంచి నిరసనలు, వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నప్పటికీ మేము ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతిని నిషేధిస్తూ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబద్ధతతో ఉన్నాం. మన ప్రభుత్వం ప్రజా సమస్యల మూలాలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం అందించాలన్న లక్ష్యంపై పని చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

"ప్రభుత్వ ఉజ్వల పథకం కింద లక్షలాది మంది మన సోదరీమణులు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు పొందగలిగారు. ఈ పథక లక్ష్యం త్వరలోనూ పూర్తిగా విజయవంతం కానుంది. ఇప్పుడు ప్రతి ఇంటికి గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాలనే లక్ష్యంతోనూ పని చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలన్న అంశం గత ప్రభుత్వ విధానంలో లేదు. దేశ మహిళలు బిజెపిపై నమ్మకం ఉంచారు" అని తెలిపారు. 

 గత ప్రభుత్వం మహిళల ప్రాథమిక అవసరాలు కూడా తీర్చలేదని,  కేవలం హామీలు ఇవ్వడానికే పరిమితమైందని ప్రధాని ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్లలో మాత్రం ఆడ శిశువుల సంరక్షణ, మహిళా సాధికారత విషయాల్లో సానుకూల మార్పు వచ్చిందని చెప్పారు. దేశంలో మొట్టమొదటిసారి మహిళల సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. 

ఉజ్వల, బేటీ బచావో బేటీ పఢావో, ప్రధాన్ ‌మంత్రి ఆవాస్‌ యోజన (75 శాతం మంది మహిళలే ఇళ్ల యజమానులు) చేపట్టింది. మైనర్‌ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే దోషులకు కఠిన శిక్షలు పడేలా చేసింది. ప్రస్తుతం దేశంలో 18 కోట్ల మంది మహిళలకు జన్‌ ధన్‌ బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. ఇప్పుడు వైమానిక దళంలోనూ ఫైటర్‌ పైలట్‌లుగా మహిళలను నియమిస్తున్నారు. నావికా దళంలోనూ మహిళా అధికారిణుల విభాగం ఉంది అని మోదీ వివరించారు.