టిడిపి, వైసిపి రెండూ అవినీతి, కుటుంబ పార్టీలే : రామ్ మాధవ్

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అధికారం కోసం తలపడుతున్న రెండు ప్రధాన పార్టీలు తెలుగు దేశం, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అవినీతి, కుటుంబ పాలనకు ప్రతిబింబిస్తున్నవే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు ఈ రెండు పార్టీలే కాకుండా మెరుగైన ప్రత్యామ్న్యామ అవసరమని పేర్కొన్నారు. 

విశాఖపట్నంలో "ఇండియా టుడే దక్షిణాది సదస్సు, 2018"లో ప్రసంగిస్తూ ఈ రాష్ట్రంలో మరే ఇతర బృందంతో అయినా ప్రత్యామ్న్యాయం అందించడం కోసం బిజెపి సిద్ధంగా ఉన్నదని తెలిపారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక `గొప్ప నిరాశ' అని రామ్ మాధవ్ విచారం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం నాయుడు "తమాషా"చేస్తున్నారని మండిపడ్డారు. "మేము ఇంటింటికి వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం" అని స్పష్టం చేశారు. 

ఒకే నాణానికి మరో వైపు వలే కాంగ్రెస్ పార్టీకి మరో ప్రతిరూపంగా తెలుగు దేశం పార్టీ మారినదని రామ్ మాధవ్ ధ్వజమెత్తారు. "అదే విధమైన అశ్రీతపక్షపాతం, అదే రకమైన కుటుంబ పాలన, అదే తరహా అసమర్ధత, అటువంటి అవినీతి పాలన" పునరావృత్తం అవుతున్నాయని పేర్కొన్నారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికల అనంతరం వై ఎస్ ఆర్ సి పి తో బీజేపీ మద్దతు కోరే అవకాశం ఏర్పడబోదని భరోసా వ్యక్తం చేశారు. 

ఇలా ఉండగా, రాజకీయాలలో శాశ్వత శత్రువులు లేదా స్నేహితులు ఉండబోరని చెబుతూ కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయని రామ్ మాధవ్ తెలిపారు. అందుకనే ఏ పార్టీ తో లేదా బృందంతో పొత్తుకు అయినా బిజెపి సిద్దమే అని స్పష్టం చేశారు. 

రాజకీయాలలో గణాంకాలు పని చేయవని, కేవలం సారూప్యమే (కెమిస్ట్రీ) ప్రభావం చూపుతాయని చెబుతూ ఎప్పుడు ఏ విషయం పని చేస్తుందో, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరం చెప్పలేమని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా తగు నిర్ణయాలు తీసుకో వలసి ఉంటుందని చెబుతూ ఆంధ్ర ప్రదేశ్ లో అనూహ్యమైన రాజకీయ పరిణామాలకు అవకాశం ఉన్నదనే సంకేతం ఇచ్చారు.  

ఈ సంవత్సరం మొదట్లో తెలుగు దేశం బిజెపితో తెగదెంపులు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ "వారు తిరిగి వస్తారో లేదో మనకు తెలియదు" అని నర్మగర్భంగా చెప్పారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ నాయుడు  పాలన రాష్ట్రంలో `గొప్ప వైఫల్యం' అని విరుచుకు పడ్డారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి విచారం కలిగిస్తున్నాయని ఆయన అంగీకరించారు. అయితే కాంగ్రెస్, టిడిపి సహితం ప్రభావం చూపలేక పోయాయని గుర్తు చేశారు. బీజేపీ చెప్పుకోదగిన విజయం సాధించలేక పోవడానికి ఆ రాష్ట్రంలో టి ఆర్ ఎస్ బలంగా ఉండటం కూడా ఒక కారణం అని చెప్పారు. 

ఇలా ఉండగా, `కాంగ్రెస్ ముక్త్ భారత్' అని బిజెపి పేర్కొనడం భౌతికంగా ఆ పార్టీని రూపు మాపడం కాదని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. "మేము కేవలం కాంగ్రెస్ రాజకీయ పాలనను మాత్రమే అంతమొందింపాలని కోరుకొంటున్నాము" అని పేర్కొన్నారు. 

మూడు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించి, ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా బీజేపీకి చెప్పుకోదగిన విచారం లేదని రామ్ మాధవ్ చెప్పారు. అక్కడ కాంగ్రెస్ విజయం సాధించినది అంటే బీజేపీ బలహీనపదిన్నట్లు కాదని తెలిపారు. కేవలం తాము మరింతగా కష్ట  పడవలసి ఉన్నట్లు ఫలితాలు నిరూపిస్తున్నాయని గుర్తు చేశారు. "మేము ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ ను పారద్రోలాము. దక్షిణ, తూర్పు ప్రాంతాలలో బలం పెంచుకొంటున్నాము" అని వివరించారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వలే ప్రపంచశ్రేణి నేతగా ఎదగాలంటే రాహుల్ గాంధీ మరెంతో దూరం ప్రయాణించ వలసి ఉన్నదని బీజేపీ నేత చెప్పారు. "అనేక విమర్శలకు గురవుతూ ఉండటం కారణంగా రాహుల్ గాంధీ పట్ల కొంత సానుభూతి ఏర్పడినదని అంగీకరిస్తాను. అయితే కేవలం విమర్శలకు గురి కావడంతో ఒకరు ప్రపంచ స్థాయి నేత కాలేరు. అదే నిజామైతే మోదీని మించిన వారెవ్వరూ ఉండబోరు. ఎందుకంటె ప్రతి ప్రతిపక్ష నాయకుడు ఆయనపై విమర్శలు కురిపిస్తూ, పేరుపెట్టి వాఖ్యలు చేస్తున్నారు" అని తెలిపారు.