పీడీ అకౌంట్లపై సిబిఐ దర్యప్తు కోరిన బిజెపి

చంద్రబాబునాయుడు అడ్డగోలుగా తెరచిన పీడీ అకౌంట్ల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరపాలని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నాయకులు డిమాండ్ చేసారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి గవర్నర్ నరసింహన్ కు ఎపి బిజెపి నేతలు ఫిర్యాదు చేసారు. గవర్నర్‌ బస చేసిన విజయవాడలోని గేట్‌వే అతిధి గృహానికి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం కలసి సుమారు 40 నిమిషాల పాటు ఫిర్యాదులోని అంశాలపై చర్చించింది.

విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, దేశంలో మరెక్కడా లేని విధంగా 54 వేల పీడీ అకౌంట్లు తెరిచి చంద్రబాబు సర్కారు భారీగా నిధులు పక్కదారి పట్టించిందని, అమరావతి బాండ్ల పేరిట నిధులు దోపిడీకి ప్రయత్నిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పీడీ అకౌంట్ల వ్యవహారంపై అకౌంటెంట్‌ జనరల్‌ నుంచి వివరణ కోరినట్లు గవర్నర్‌ తమకు తెలిపారని, ఇంకా కొన్ని విషయాలు సేకరిస్తున్నారని, ఈ అంశాన్ని నిశితంగా చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని గవర్నర్‌ వ్యక్తం చేసినట్లు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

అన్నింట్లో తాము నంబర్‌వన్‌ అని అని చెప్పుకునే ముఖ్యమంత్రి నిధులు మళ్లించడంలోనూ అగ్రస్థానంలో నిలిచారని జీవీఎల్‌ ఆక్షేపించారు. ఇతర రాష్ట్రాల్లో పంచాయతీ సంస్థలకు పీడీ అకౌంట్లు లేవని, ఈ రాష్ట్రంలో ఎందుకు ఆ ప్రత్యేక అవసరం వచ్చిందో నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఎలాంటి తప్పు జరగకపోతే సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ఎందుకు వెనుకబడుగు వేస్తున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం 2015 డిసెంబర్‌లో భోగాపురం, ఓర్వకల్లు, నెల్లూరులో గ్రీన్‌ఫీల్డ్‌‌ విమానాశ్రయాలు నిర్మించేందుకు అనుమతిస్తే ఇప్పటివరకు చేపట్టలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అమసర్ధ, అవినీతికి ప్రణాళికలు వేసుకోవడానికే అనే భావన కలుగుతోందని సోము వీర్రాజు దుయ్యబట్టారు.