సోహ్రబుద్దీన్ బతికుంటే మోదీని చంపేసి ఉండేవాడు !

సోహ్రబుద్దీన్ షేక్‌ కనుక బతికి ఉంటే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని చంపేసి ఉండేవాడని గుజరాత్ మాజీ డీజీపీ డీజీ వంజారా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2005 నాటి సోహ్రబుద్దీ 22 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 

తీర్పు అనంతరం వంజారా మాట్లాడుతూ.. తాను తన బృందం సత్యం వైపు నిలబడ్డామన్న విషయం నేడు రుజువైందని చెప్పారు. 

‘‘అప్పటి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు కనుక సోహ్రబుద్దీన్‌ను చంపకపోయి ఉంటే, అప్పటి (2005) గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని సోహ్రబుద్దీన్ చంపేసి ఉండేవాడు’’ అని వంజారా పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో తాను తొమ్మిదేళ్లు జైలులో గడపాల్సి వచ్చిందని అయితే, సత్యం ఏంటనేది నేడు బయటకు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. 

వంజారాను ఈ కేసును విముక్తి కల్పిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది సెప్టెంబరులో బాంబే హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారులు అభయ్ చుడాస్మా, పీసీ పాండే, రాజస్థాన్ మాజీ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా, గుజరాత్ మాజీ హోంమంత్రి , ప్రస్తుత బీజేపీ చీఫ్ అమిత్ షా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి గీతా జోహ్రీ కూడా ఉన్నారు.