`సమాఖ్య కూటమి' కసరత్తుకై కేసీఆర్ యాత్ర

ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఇక తనకు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానని, కాంగ్రెస్, బిజెపియేతర పక్షాలతో `సమాఖ్య కూటమి'ని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన చంద్రశేఖరరావు ఆదివారం నుండి కీలక పర్యటన జరుపుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చేతులు కలిపి కూటమి ఏర్పాటుకు విముఖంగా ఉన్న పలువురు నేతలను కలువనున్నారు.

ఈ సందర్భంగా రెండో సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా ఢిల్లీలో మర్యాదపూర్వక భేటీ జరుపనున్నారు.ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు. 

నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్ వంటి నేతలతో భేటీకి కార్యక్రమం రూపొందించుకున్నారు. ముందుగా ఆదివారం విశాఖపట్నం చేరుకొని అక్కడ  అక్కడ శారదా పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటారు. ఆ ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత విశాఖ నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళతారు. 

సాయంత్రం 6 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అవుతారు. ఆ రోజు రాత్రి అక్కడే ముఖ్యమంత్రి అధికార నివాసంలో  బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్‌ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయాలను సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్‌ చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తారు.

25వ తేదీ నుండి రెండు, మూడు రోజుల పాటు దిల్లీలోనే ఉంటారని తెలిసింది. 26న సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలుస్తారు. తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమవుతారు. కొత్త ఓటర్ల నమోదులో సంస్కరణలపై సలహాలు, సూచనలు ఇస్తారని తెలిసింది. కారు గుర్తును పోలి ఉండే ట్రక్కు, రోడ్డు రోలరు వంటి గుర్తులను ఎన్నికల్లో ఉపయోగించడం వలన గ్రామీణ ఓటర్లు పొరబడుతున్నారని.. అలాంటి గుర్తులను ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేయనున్నట్లుతెలిసింది. 

అలాగే దిల్లీలో బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో భేటీ అవుతారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ను కలుస్తారు. పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.