బాండ్ల జారీకి అంత కమీషన్ ఎందుకు చంద్రబాబు !

ఆర్థిక నిర్వహణలో కట్టుదిట్టనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలో ఎక్కడా లేని విధంగా 10.32శాతం వడ్డీ బాండ్లను జారీ చేసి, బాండ్ల జారీ నిర్వహణ సంస్థకు అధిక కమీషన్ ఎందుకు చెల్లించవలసి వచ్చిందో వివరణ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండు చేసారు. అసలు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందో? తిరిగి అప్పు చెల్లించే ప్రణాళిక ఏమిటో స్పష్టం చేయాలని కోరారు.

చంద్రబాబునాయుడు వైఫల్యాలు, అవినీతిపై  ప్రతి వారం ఐదు ప్రశ్నలతో సీఎంకు బహిరంగ లేఖలు రాస్తున్న కన్నా వరుసగా ఎనిమిదో రాసిన ఎనిమిదో లేఖను విడుదల చేశారు. రాజధాని అమరావతిలో సీడ్‌ క్యాపిటల్‌ ఏరియాను సింగపూర్‌ కంపెనీలు అవినీతి కార్యక్రమాలను ప్రోత్సహిస్తాయని తెలిసీ వాటితో జత కట్టడానికి గల కారణాలేమిటో తెలపాలని మాజీ మంత్రి కోరారు.

కాగా, శ్రీకాకుళం జిల్లాలో టెండర్లను పిలవకుండా రూ.75 లక్షలను నామినేషన్‌ పద్ధతిలో దోచుకోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర పథకాలకు మళ్లించలేదా అని అడుగుతూ  ప్రచార పథకాలకు ఇష్టానుసారంగా నిధులు మళ్లించి అన్యాయం చేయడంలేదా అని నిలదీశారు.

రాష్ట్రంలోని ఖనిజ సంపద మొత్తాన్ని అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇంత మైనింగ్‌ మాఫియా ఎప్పుడైనా చోటు చేసుకుందా? చివరకు హైకోర్టు చివాట్లు పెట్టే వరకూ స్పందించని  మీ దైర్భాగ్య ప్రభుత్వం ఇంకా అధికారంలోకి కొనసాగే హక్కు ఉందా?అంటూ ప్రశ్నించారు.  అధికార పార్టీ కార్యకర్తలకు నామినేషన్‌ పద్దతితో ప్రభుత్వ పనులను ఇస్తున్నారని ఆరోపిస్తూ దానిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని అడిగారు.