తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ .. టీఆర్ఎస్‌ లో ఎమ్మెల్సీల విలీనం !

అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయం నుండి కోలుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మరో షాక్ కలిగింది. ఎవ్వరు ఊహించని రీతిలో పార్టీకి చెందిన ఎమ్యెల్సీలు అందరూ టీఆర్ఎస్‌ లో విలీనానికి సిద్ధపడ్డారు. దానితో శాసన మండలిలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయే పరిస్థితి నెలకొంది. 

ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌  శాసనమండలి  పక్షాన్ని  టీఆర్ఎస్‌  లో విలీనం చేయాలని మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌, ఆకుల లలిత, సంతోష్‌ కుమార్‌ శుక్రవారం కలిశారు. విలీనం చేయాలని కోరుతూ లేఖ అందజేశారు.

నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్‌ గురువారమే  ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును వేర్వేరుగునా కలిశారు. న్నికల్లో టీఆర్ఎస్‌ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.

 దీంతో వీరు  టీఆర్ఎస్‌  లో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.  ఇప్పటికే ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్‌  లో చేరారు. ఆ పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు.

మండలి పక్షాన్ని  టీఆర్ఎస్‌  లో విలీనం చేస్తే శాసనమండలిలో కాంగ్రెస్‌ సభ్యుల బలం కేవలం రెండుకు చేరే అవకాశం ఉంది. షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలుగా ఉంటారు. వారి పదవీ కాలం కూడా మార్చితో ముగియనుంది. 

మండలిలో కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యులు ఉండగా ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 40 మంది ఉన్న శాసనమండలిలో ప్రతిపక్ష హోదాకు కనీసం నలుగురు సభ్యులు అవసరం. కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలితే ప్రతిపక్ష హోదా పోయే అవకాశం ఉంది.

మరోవంక కాంగ్రెస్ ఎమ్యెల్యేలుగా ఎన్నికైన వారు సహితం పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్‌ లో చేరడానికి మంతనాలు జరుగుతున్నాయి. శాసన సభలో సహితం కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కకుండా అధికార పక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.