తెలంగాణలో ప్రజా కూటమి విఫల ప్రయోగం !

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంతో  హడావుడిగా, రాజకీయ సిద్ధాంతాలను సహితం గాలికి వదిలి వేసి కాంగ్రెస్ సారధ్యంలో ఏర్పాటు చేసుకున్న `ప్రజా కూటమి' మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. ఓట్ల లెక్కింపు జరిగి పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూటమి నేతలు కలుసుకొననే లేదు. కూటమి కొనసాగింపు పట్ల ఎవ్వరు ఆసక్తి చూపడం లేదు. కూటమిలో చేరడం ద్వారా రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడిన్నట్లు అయిన్నట్లు ప్రతి భాగస్వామ్య పార్టీ భావిస్తున్నది. 

దానితో ప్రజాకూటమి మనుగడ ప్రశ్నార్ధకరంగా మారింది. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపటమే లక్ష్యంగా నాలుగు పార్టీలతో ఏర్పిడిన కూటమి ఒక విఫలయత్నంగా భాగస్వామ్య పార్టీలు భావిస్తున్నాయి. నాలుగు ప్రధాన పార్టీల కలయికతో రాష్ట్రంలో ఏర్పడిన ప్రజాకూటమి దేశం దృష్టిని ఆకర్షించినప్పటికే టీఆర్‌ఎస్‌ గాలికి అది కొట్టుకుపోవలసి వచ్చింది. పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు దగ్గర నుంచి ప్రచారం వరకూ వివిధ దశల్లో కూటమి పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. 

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కూటమి అధికారంలోకి వస్తుందనే ధీమాతో ముందే మంత్రి పదవుల నుండి ఇతర అధికార పార్టీలను పంచుకున్న  నాలుగు పార్టీలకు శృంగభంగమైనది. ప్రజా విశ్వాసం పొందడంలోకూటమి నేతలు ఘోరంగా విఫలం అయ్యారు. పైగా తెలంగాణకు వ్యతిరేకిగా ముద్ర పడిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారంలొ హల్ చల్ చేయడం తెలంగాణ ప్రజలు సహించలేక పోయారని ఇప్పుడు గ్రహిస్తున్నారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా వేసుకున్న అంచనాలలో సహితం తెలుగు దేశంతో పొత్తు తమను దారుణంగా దెబ్బ తీసినదని వెల్లడైన్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఇక ఆ పార్టీతో ఎన్నికల పొత్తుకు దూరంగా ఉండాలని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సహితం టిడిపితో పొత్తు పట్ల వెనుకడుగు వేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అంత ఎక్కువగా తిరిగి ఉండవలసింది కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ సహితం పేర్కొన్నారు. 

కూటమిలోని నాలుగు పార్టీలలో రెండు పార్టీలకు అసలు శాసన సభలో ప్రవేశం లేకుండా పోయింది. తెలుగు దేశం రెండు  సీట్లతో సరిపెట్టుకోగా, 2014లో గెలిచినా సీట్లు కూడా గెలవలేక 19 సీట్లకు కాంగ్రెస్ పరిమితమైనది. కూటమి గెలుపొందిన 21 సీట్లలో 8 సీట్లు ఖమ్మం జిల్లాలోనివే కావడం గమనార్హం. భాగస్వామ్య పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరుగక పోగా, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉమ్మడి శత్రువుగా భావించిన టి ఆర్ ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేసిన్నట్లు భావించ వలసి వస్తున్నది. 

అసెంబ్లీ ఎన్నికల పక్రియ పూర్తి కాగానే పంచాయతీ ఎన్నికల సందడి మొదలైనా కూటమి నేతలలో ఉలుకు పలుకు కరువవుతుంది. ఎవ్వరికీ వారుగానే పోటీ చేయడం పట్ల దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడిగా ఫోటీ చేసే ఉద్దేశ్యం ఏ పార్టీలో ఉన్నట్లు కనబడటం లేదు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ కసరత్తు ప్రారంభించినా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో కలసి అడుగు వేసే విషయమై నోరు మెదపడం లేదు. 

పంచాయతీ ఎన్నికలలో ఒంటరిగా  పోటీ చేయాలనే ప్రతిపాదన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల నుంచి వస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఒంటరిగా బరిలోకి దిగితేనే ప్రయోజనం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఏఐసీసీకి కూడా ఒక నివేదిక రూపంలో పంపించటానికి టీపీసీసీ సన్నాహాలు చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబును బూచిగా చూపించి అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా టీఆర్‌ఎస్‌ లబ్ది పొందిందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు మిత్ర పక్షాల మధ్య ఓట్ల బదలాయింపు జరగలేదని అటు కాంగ్రెస్‌, ఇటు తెలుగుదేశం నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీతో పొత్తు కొనసాగించటం శ్రేయస్కరం కాదనే అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. 

టీడీపీ నేతలు మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. పొత్తుల వ్యవహారాన్ని చంద్రబాబుకే వదలి వేయాలని వారు భావిస్తున్నారు. పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవని స్పష్టం కావటంతో ఈ ఎన్నికల్లో తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. పైగా సొంతంగా పోటీ చేసే ధైర్యం వారిలో కనబడటం లేదు. 

కాంగ్రెస్‌ పార్టీ కూడా విడిగా పోటీచేసి తమ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలనే అభిప్రాయంతో ఉన్నది. లోక్‌సభ ఎన్నికల్లో టీజేఎస్‌, సీపీఐతో పొత్తు లేకుండా ఒంటరిగా రంగంలోకి దిగాలని యోచిస్తున్న కాంగ్రెస్‌ టీడీపీ పొత్తు విషయంలో రాహుల్‌ ఏమి చెప్తారోనని చూస్తున్నది. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న కూటమి కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రియాశీలంగా వ్యవహరించటం, రాహుల్‌ గాంధీ కూడా చంద్ర బాబుతో కలిసి పనిచేయాలని నిర్ణయించటంతో రెండు పార్టీలకు చెందిన స్థానిక నేతలు ఏమీ మాట్లాడలేక పోతున్నారు.

 టీజేఎస్‌కు ఓటు బ్యాంకు లేదని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోవటంతో ఆ పార్టీని కలుపుకుని పోవటానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు సుముఖంగా లేరు. ఎటువంటి నిర్మాణం లేకుండానే ఎన్నికలకు పోవటంతో తమ పార్టీ పరాజయం పాలైందని భావిస్తున్న టీజేఎస్‌ నేతలు కూడా పంచాయితీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమవుతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ ఇటీవల ప్రకటించారు.కాంగ్రెస్‌ శ్రేణులు తమ పార్టీ అభ్యర్ధులకు ఓట్లు వేయలేదని టీజేఎస్‌ నేతలు భావిస్తున్నారు. 

కాంగ్రెస్‌ నేతల వైఖరితో విసుగు చెందిన సీపీఐ నేతలు కూడా కూటమి మనుగడపై నోరుమె దపటంలేదు. పొత్తుల్లో జరిగిన జాప్యంతో పాటూ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు తమ పార్టీ అభ్యర్ధులకు పడకపోవటంతోనే తమ పార్టీ అభ్యర్ధులు పరాజయం పాలయ్యారని సీపీఐ రాష్ట్ర నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఒంటరిగా పోటీచేస్తే ఎన్ని ఓట్లు వస్తాయో కూటమిలో ఉన్నా అన్నే ఓట్లు వచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొనడం గమనార్హం.