విజయవాడ మెట్రోరైల్‌కు ప్రతిపాదనే లేదు

విజయవాడలో మెట్రోరైల్ నిర్మాణంకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదని పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మెట్రోరైల్ విధానానికి అనుగుణంగా విజయవాడలో మెట్రోరైల్ నిర్మాణానికి తిరిగి ప్రతిపాదన పంపించవలసిందిగా సెప్టెంబర్ 2017లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని చెప్పారు. 

పైగా, పట్టణ రవాణా అనేది పట్టణాభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగం.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవహారం.. పట్టణ రవాణ వ్యవస్థకు అవసరమైన వౌలిక వసతులు కల్పించే బాధ్యత కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని మంత్రి వెల్లడించారు.  

అయితే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాగానే విజయవాడలో మెట్రో రైల్ ఏర్పాటు పట్ల నాటి పట్టణాభివృది శాఖ వెంకయ్యనాయుడు ఆసక్తి చూపారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో స్వయంగా సమాలోచనలు జరిపి తగు ప్రతిపాదనలు పంపమని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు కసరత్తు జరిపింది. 2015 సెప్టెంబర్ లో సూత్రప్రాయంగా అనుమతులిచ్చినా 2017 మార్చ్ లో దాని నిర్వహణ విషయంలో ఆర్ధిక సౌలభ్యం గురించి ప్రశ్నలు తలెత్తాయి. అప్పటి నుండి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదు. 

విభజనచట్టంలో పేర్కొన్న విధంగా విజయవాడకు మెట్రో ఇస్తున్నారనీ, దీనిపై తన ఒత్తిడి కూడా ఉందనీ చెప్పిన సిఎం చంద్రబాబునాయుడు, విశాఖ మెట్రోను మాత్రం పిపిపి పద్ధతిలో చేపడతామని తెలిపారు. అయితే విజయవాడ మెట్రో ఎందుకు నిర్మించరనే అంశాన్ని సిఎం ఇంతవరకూ కేంద్రం వద్ద ప్రస్తావించలేదు. కేంద్రం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వెలుగులోకొచ్చింది. తగు ప్రతిపాదనలను కేంద్రం కోరితే ఎందుకు స్పందించలేదు అర్ధం కావడం లేదు. 

ఫైనాన్సియల్‌ రిటర్న్‌, ఎకనమిక్‌ రిటర్న్‌ అనుకూలంగా లేవనీ, ఈ నేపథ్యంలో నిర్వహణను ప్రభుత్వమే తీసుకుంటుందనీ చెప్పింది. ఈ మేరకు క్యాబినెట్లోనూ తీర్మానం చేశారు. అనంతరం ఇప్పటి వరకూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు. పైగా విజయవాడలో  లైట్‌ మెట్రో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా సమగ్ర ప్రణాళికను ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా కన్సల్టెన్సీ నివేదికను రూపొందిస్తోంది. దీనిలో జర్మనీ సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ జరుగుతోందని మెట్రో కార్పొరేషన్‌ తెలిపింది. 2019 ఫిబ్రవరి నాటికి సమగ్ర ప్లాను వస్తుందని ప్రకటించింది.