‘ఇంటింటా భాజపా’లో కేంద్ర సహాయంపై ప్రచారం

ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయటానికి త్వరలో ‘ఇంటింటా భాజపా’ కార్యక్రమం చేపట్టాలని ఆ పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్ణయించింది. పద్దుల వారీగా కేంద్రం అందించిన సాయాన్ని కరపత్రంలో ముద్రించి పంచాలని తీర్మానించింది.

ఇప్పటి వరకు విజయవాడలో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రస్తుతం గుంటూరుకు మార్చారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మొదటగా పార్టీ రాష్ట్ర అద్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడం, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ రాస్త్రంలో కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై చర్చించారు.

ఆంధ్రలో వరదలు వచ్చి రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కేరళకు ఆర్థిక సాయంపై కేంద్రాన్ని విమర్శించడం తగదని స్పష్టం చేసారు. కేంద్రం మంజూరు చేసిన నిధులను తీసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని నిర్ణయించారు. గత కాంగ్రెస్ పాలనలే రాష్త్రానికి కేంద్రం నుండి రూ 1.17 లక్షల కోట్ల నిధులు మాత్రమె సమకూర్చగా, గత నాలుగేళ్ళలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ 2.44 లక్షల కోట్ల నిధులు సమకూర్చిన విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలని నిర్ణయించారు.

‘‘రాష్ట్రంలో గెలుపే ధ్యేయంగా పార్టీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలి. పార్టీలో కొత్త వారిని చేర్చుకోవాలి. పదవుల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. రాష్ట్రంలో ఇటీవల వరదలకు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం, ఉచితంగా విత్తనాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’’ అని సమావేశంలో నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి తెలిపారు.

కాగా, త్రిపురలో భాజపాను అధికారంలోకి తీసుకురావటంలో కీలకంగా వ్యవహరించిన సునీల్‌ దేవధర్‌ నెలలో 20 రోజులు రాష్ట్రంలోనే ఉండి పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకుంటారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర ఇన్‌చార్జి సతీశ్‌జీ, సహ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యప్రసాద్‌, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు పురందేశ్వరి, మాజీ కేంద్ర మంత్రులు కృష్ణంరాజు, కావూరి సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు  తదితరులు పాల్గొన్నారు