ప్రముఖ జర్నలిస్ట్‌ కుల్దీప్ నయ్యర్ కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్‌, కాలమిస్టు కుల్దీప్ నయ్యర్(95) ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం రాత్రి 12.30 సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

1923, ఆగస్టు 14న పాకిస్తాన్ లోని సియోల్‌కోట్‌లో జన్మించిన కుల్‌దీప్‌ నయ్యర్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌, రచయితగా విశేష సేవలందించారు. ఆయన ఉర్ధూ పత్రిక అంజమ్‌లో జర్నలిస్ట్‌గా కేరీర్‌ ప్రారంభించారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.  'బిట్వీన్‌​ ది లైన్స్‌' పేరుతో ప్రచురితమైన కాలమ్‌ దాదాపు 80 పత్రికల్లో ప్రచురితమయ్యింది. జర్నలిస్ట్‌గానే కాకుండా మానవ హక్కుల ఉద్యమకారుడిగా కుల్దీప్ అనేక పోరాటాలు చేశారు. 

రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాల్లో బియాండ్‌ ది లైన్స్‌, డిస్టెంట్‌ నైబర్స్‌ : ఎ టేల్‌ ఆఫ్‌ ది సబ్‌ కాంటినెంట్‌, ఇండియా ఆఫ్టర్‌ నెహ్రూ అండ్‌ అదర్స్‌, ఎమర్జెన్సీ రీ టోల్డ్‌ లు ఉన్నాయి. 1990లో బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా సేవలందించారు. 1997లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు.

కులదీప్‌ నయ్యర్‌ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘కులదీప్‌ నయ్యర్‌ మా కాలంలోని మేధో దిగ్గజం. ఆయన అభిప్రాయాలు నిజాయితీగా, నిర్భయంగా ఉంటాయి. ఆయన కొన్ని దశాబ్దాల పాటు సేవలందించారు. ఎమర్జెన్సీని బలంగా వ్యతిరేకించిన వ్యక్తిగా, దేశంలో పబ్లిక్‌ సర్వీసులు, కమింట్‌మెంట్స్‌ మరింత మెరుగుపడాలని తీవ్రంగా కోరుకున్న వ్యక్తిగా ప్రజలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని నివాళులు అర్పించారు. ఆయన మరణం ఎంతో బాధ కలిగించిందని అంటూ సంతాపం తెలుపుతూ మోదీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

కులదీప్‌ నయ్యర్‌ అంతిమ సంస్కారాలు నగరంలోని లోధి స్మశానవాటికలో జరుగుతాయని నయ్యర్‌ పెద్ద కుమారుడు సుధీర్‌ నయ్యర్‌ వెల్లడించారు.