గెలిస్తే ఈవీఎంలు బెస్ట్... ఓడితే వేస్ట్ : ప్రధాని ఎద్దేవా

ఈవీఎంల  విశ్వసనీయతపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ధోరణిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుబట్టారు.   ప్రతి ఎన్నికల సమయంలోనూ ఈవీఎంల పనితీరుపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తున్నదని, అయితే ఎన్నికల్లో గెలిస్తే మాత్రం వాటిని అంగీకరిస్తోందని విమర్శించారు. పరీక్షల్లో సరైన ఫలితాలు రాకపోతే దానికి టీచర్లు, ఎగ్జామినరే కారణమంటూ విద్యార్థులు నెపం నెట్టినట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. 

పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన బీజేపీ బూత్ లెవల్ కార్యక్తరలతో ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తెలంగాణలో సహితం తమ ఓటమికి ఈవీఎంలే కారణం అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం గమనార్హం. 

 ఆర్మీ, కాగ్ వంటి ప్రధాన ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందని మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందం విషయంలో తనపై వస్తున్న విమర్శలనూ మోదీ తిప్పికొట్టారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును సైతం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందని, అందుకు కారణం ఆ తీర్పు వారికి నచ్చకపోవడమేనని ధ్వజమెత్తారు. 

కేవలం తమకు నచ్చలేదన్న ఒకే ఒక కారణంతో సుప్రీంకోర్టు తీర్పునే వారు ప్రశ్నిస్తారని చెబుతూ కోర్టు న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నదన్న కారణంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని(సీజేఐ) సైతం అభిశంసించడానికి వారు ప్రయత్నించారు అని ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ ఏడాది ప్రారంభంలో, అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా వ్యవహారశైలి సరిగా లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. ప్రజాస్వామ్యానికి ప్రజలే రక్షకులని స్పష్టం చేస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై దాడికి యత్నిస్తే, ప్రజలే వారిని గద్దె దించారని ప్రధాని గుర్తు చేశారు. 1975లో ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ డీఎన్‌ఏ ఇప్పటికీ అలాగే ఉందని ప్రజలకు వివరించండి. ప్రజాస్వామ్యంతో వారు ఆటలాడడాన్ని ప్రజలు క్షమించకూడదు అని పిలుపునిచ్చారు. మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్ అని పిలుపునిస్తూ బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలని దినిర్ధేశం చేశారు. 

ఎన్డీయే సర్కారు కష్టపడి చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలకు మోదీ సూచించారు.కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని, దానిని ఎలా ఎదుర్కోవాలని ఒక కార్యకర్త ప్రశ్నించినప్పుడు ప్రధాని ఈ సూచన చేశారు. క్రిమినాశనానికి సూర్యరశ్మి ఎంత ముఖ్యమో సమాచారం-చైతన్యం అనేవి ప్రజాస్వామ్యానికి అంత ముఖ్యమని స్పష్టం చేశారు.

 ‘కాంగ్రెస్‌ సహా విపక్షాల ప్రవర్తన తీరు, అవి ఆడుతున్న ప్రమాదకర ఆటలు గురించి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. దుష్ప్రచారానికి వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. వాటిని ఎండగట్టడం ద్వారా నిజాన్ని చాటిచెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది'అంటూ దిశానిర్ధేశం చేశారు.