రూపాయి పతనంపై ఆందోళన అవసరం లేదు

రూపాయి విలువ పతనంపై మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న సంజీవ్ సన్యాల్ స్పష్టం చేసారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణతపై ఆందోళన అక్కర్లేదని, అంతర్జాతీయంగా చూస్తే చాలా దేశాల కరెన్సీలు నష్టాల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. ఇటీవల రూపాయి విలువ రూ.70 మార్కును అధిగమించిన విషయం తెలిసిందే.

గత ఐదేండ్లకుపైగా కాలంలో చాలా దేశాల కరెన్సీల విలువ పడిపోయిందని, రూపాయి విలువ మాత్రం వాటన్నిటికంటే నిలకడగానే ఉందని చెప్పారు. ఇటీవలి రూపాయి చారిత్రక పతనంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై రూపాయికి విశ్వాసం లేదని, అందుకే వరుసగా పతనమవుతున్నదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

కాగా, రూపాయి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగినవిధంగానే చర్యలు చేపడుతున్నదన్న సన్యాల్ భారత్ వద్ద సరిపడానే డాలర్ నిల్వలున్నాయని చెప్పారు. టర్కీ ఆర్థిక సంక్షోభం మధ్య రూపాయిసహా చాలా దేశాల కరెన్సీలు ఈమధ్య భారీ నష్టాలను చవిచూస్తున్న సంగతి విదితమే.

మరోవంక, అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం, టర్కీ ఆర్థిక సంక్షోభం నడుమ తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ప్రపంచ ఫారెక్స్ మార్కెట్ ఇప్పుడు కుదుటపడుతున్నది. మెజారిటీ ఆసియా మార్కెట్లు కోలుకుంటుండటంతో రూపాయి విలువ కూడా క్రమేణా బలపడుతున్నదని ఎపిక్ రిసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ తెలిపారు.

ద్రవ్యోల్బణం భయాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి రూపాయి విలువను దిగజారుస్తుండగా, ఇక ప్రతికూల పరిస్థితులు తగ్గుముఖం పట్టగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సైతం రూపాయి విలువపట్ల ఆం దోళన అక్కర్లేద న, దాని సహజ విలువను అది కోల్పోలేదని చెప్పినది తెలిసిందే.

టర్కీ కరెన్సీ లీరా పతనం రూపాయిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న నేపథ్యంలో భారత ఫారెక్స్ నిల్వలు ఇంకా పడిపోనున్నాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నెల 10 నాటికి దేశంలో డాలర్ నిల్వలు 400.88 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది దాదాపు తొమ్మిది నెలల కనిష్ఠం. గడిచిన నాలుగు నెలల్లో 25 బిలియన్ డాలర్లకుపైగా నిల్వలు తరిగిపోయాయి. ఆగస్టు 10తో ముగిసిన వారంలోనే 1.8 బిలియన్ డాలర్లమేర పడిపోయాయి.

ఈ క్రమంలో 400 బిలియన్ డాలర్ల మార్కుకు దిగువన నిల్వలు చేరుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువైపోవడంతో డాలర్లకు డిమాండ్ పెరుగుతున్నది. జూలైలో వాణిజ్య లోటు ఐదేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 18.02 బిలియన్ డాలర్లకు చేరినది విదితమే. ఈ క్రమంలో రూపాయి కంటే వాణిజ్య లోటే ఇప్పుడు ప్రమాదమని రాజీవ్ కుమార్ అనడం గమనార్హం.

కాగా, రూపాయి విలువ వరుసగా పతనమవుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌పై పెద్దగా చూపబోదని, ఆ కోణంలో వచ్చిన భయమేమీ లేదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. రూపాయి విలువ క్షీణత అంతర్జాతీయ కారణాల వల్లే జరుగుతున్నదన్నది. దేశీ జీడీపీలో విదేశీ రుణాల వాటా కేవలం 13 శాతంగానే ఉండటం కూడా రేటింగ్ జోలికి వెళ్లకుండా చేస్తున్నదని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం కార్పొరేట్, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న ఒత్తిడికర పరిస్థితులను రూపాయి నష్టం మరింత పెంచగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.