రెండో రోజే వివాదాల్లోకెక్కిన కమల్‌నాథ్‌

మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ బాధ్యతలు చేపట్టిన రెండో రోజే వివాదాల్లో నిలిచారు. ఉద్యోగాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. ‘బయటి వ్యక్తులంటూ’ ఇతర రాష్ట్రాల ప్రజల మనోభావాలను కించపరిచేలా కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని బిజెపి  డిమాండ్‌ చేస్తోంది.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టిన రెండు గంటలకే రైతు రుణమాఫీ దస్త్రాలపై సంతకం చేసిన కమల్‌నాథ్‌.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాలు, పరిశ్రమల గురించి ప్రస్తావించారు. 

‘రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాటిల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ లాంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు పనిచేస్తున్నారు. వారిని విమర్శించాలని నేను అనుకోవడం లేదు. కానీ దీని వల్ల మధ్యప్రదేశ్‌ యువత ఉపాధి కోల్పోతున్నారు. 70శాతం ఉద్యోగాలు రాష్ట్రానికి చెందిన యువతకు కల్పించే పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తాం’ అని కమల్‌నాథ్‌ ప్రకటించారు. 

కాగా.. ఈ వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారానికి దారితీశాయి. కేంద్రమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కమల్‌నాథ్‌ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు చేశారు. కొందరు నేతలైతే కమల్‌నాథ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

కాన్పూర్‌లో పుట్టి, పశ్చిమ్‌బంగాలో చదువుకున్న ఓ వ్యక్తి మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రి ఎలా అయ్యారంటూ బిజెపి  నేత ఒకరు దుయ్యబట్టారు. మహారాష్ట్రా, గుజరాత్ లలో హిందీ ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగులు, కార్మికులపై దాడులు జరుగుతూ ఉంటె ఖండిస్తున్న కాంగ్రెస్ మధ్య ప్రదేశ్ లో మాత్రం భిన్నంగా వ్యవహరించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.