99% వస్తువులు.. 18% కన్నా తక్కువ శ్లాబుల్లోనే

సగటు మనిషి వినియోగించే అన్ని రకాల వస్తువులు, సేవలపై 18శాతం, అంతకంటే తక్కువ జీఎస్‌టీ ఉండేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ముంబయిలో జరుగుతున్న రిపబ్లిక్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ జీఎస్‌టీ గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్‌లో జీఎస్‌టీని మరింత సరళీకృతం చేయనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించారు. అంటే రానున్న రోజుల్లో మరిన్ని వస్తువులపై వస్తు, సేవల పన్ను తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి.

‘తొలి రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో వస్తువులపై ఉన్న పన్నులు, వ్యాట్‌ల ఆధారంగా జీఎస్‌టీ శ్లాబులను ఏర్పాటుచేశాం. అయితే ఆ తర్వాత జరిగిన చర్చల ద్వారా పన్ను వ్యవస్థ మరింత మెరుగుపడింది. ఇప్పుడు సగటు మనిషి వినియోగించే వస్తువులు, సేవల్లో దాదాపు 99శాతం వాటిని 18శాతం, అంతకంటే తక్కువ శ్లాబుల్లోకి చేర్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాం’ అని మోదీ చెప్పారు. అంటే 28శాతం శ్లాబులో కేవలం ఎంపిక చేసిన లగ్జరీ వస్తువులు మాత్రమే ఉండాలని మోదీ సూత్రప్రాయంగా తెలిపారు. 

జీఎస్‌టీ కావాలంటూ దశాబ్దాలుగా దేశ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని, జీఎస్‌టీ అమలుతో వాణిజ్య మార్కెట్‌, వ్యవస్థ సమర్థత మెరుగుపడిందని మోదీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా పారదర్శకంగా మారుతోందన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మోదీ చెప్పుకొచ్చారు. 

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక సంస్కరణగా అభివర్ణిస్తూ వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను గతేడాది జులై 1న కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీని కింద వస్తువులు, సేవలపై 28, 18, 12, 5 శ్లాబుల్లో పన్నులు విధించింది. తొలుత 28శాతం శ్లాబు కింద చాలా వస్తువులను చేర్చగా.. ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో క్రమంగా వాటిని కింది శ్లాబులకు మార్చింది. అలా ప్రస్తుతం 28శాతం శ్లాబులో 35 రకాల వస్తువులు మాత్రమే ఉన్నాయి.