కాంగ్రెస్ కు అనిల్ అంబానీ వార్నింగ్ !

రాఫెల్ జెట్ విమానాల కొనుగోలు డీల్‌‌కు సంబంధించి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ ఘాటుగా స్పందిస్తున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దంటూ ఏకంగా ఒక కాంగ్రెస్ య్మ్పికి లీగల్ నోటీసుల ద్వారా వార్నింగ్ ఇచ్చారు. కాగా  తమ సంస్థను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నదంటూ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్,  రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్  రిలయన్స్ ఏరోస్ట్రక్చర్  కాంగ్రెస్ పార్టీకి లీగల్ నోటీసులు పంపింది. ఒక పారిశ్రామిక వేత్త రాజకీయ నాయకులకు ఈ విధంగా లీగల్ నోటీసులు ఆరోపణలపై పంపటం బహిశా ఇదే ప్రధమం.

రాఫెల్ ఒప్పందం గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్‌కు ఈ నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని హెచ్చరించింది.

అలాగే కాంగ్రెస్ ప్రతినిధులు రణ్‌దీప్ సూర్జేవాలా, అశోక్ చవాన్, సంజయ్ నిరుపమ్, అనుగ్రహ్ నారాయణ్ సింగ్, ఊమన్ చాందీ, శక్తిసిన్హ్ గోహిల్, అభిషేక్ మను సింఘ్వి, సునీల్‌కుమార్ జఖార్, ప్రియాంకా చతుర్వేదిల పేర్లను కూడా ఈ నోటీసుల్లో చేర్చింది. అయితే ఆ నోటీసులను తేలిగ్గా తీసుకున్న జైవీర్ షెర్గిల్  తాను కాంగ్రెస్ సైనికుడినని, అంతేకాకుండా పంజాబీనని, ఇటువంటి నోటీసులు, హెచ్చరికలకు భయపడేది లేదని ట్వీట్ చేశారు.

మరోవంక రఫేల్ డీల్‌పై ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు గాను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, ఏపీ సునీల్ జాఖర్‌కు రిలయెన్స్ గ్రూపు లీగల్ నోటీసులు పంపింది. పార్లమెంటులో రఫేల్ డీల్‌పై మాట్లాడిన సందర్భంలో ఒక పేపర్ విమానాన్ని జాఖర్ చూపిస్తూ, ఈ విమానాన్ని రూపొందించేదుకు అవసరమైన నైపుణ్యాలు కూడా ఇండస్ట్రియలిస్టులకు లేవంటూ విమర్శలు చేశారు.  దీనిపై జాఖర్ స్పందిస్తూ, రఫేల్ డీల్‌ అవకతవకలపై తాను ఏం మాట్లాడానో ఆ మాటలకు కట్టుబడి ఉంటానని, చివరివరకూ పోరాడతానని స్పష్టం చేశారు.

కాగా రాహుల్ గాంధీ ఆరోపణలపై అనిల్ అంబానీ ఇప్పటికే రెండు లేఖలను నేరుగా ఆయనకే  రాశారు. రాఫెల్ విమానాలకు సంబంధించి ఫ్రెంచి కంపెనీ డస్సాల్ట్‌తోనూ, భారత రక్షణ మంత్రిత్వశాఖతోనూ రిలయన్స్ సంస్థ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, స్వార్థపూరిత శక్తులు కార్పొరేట్ ప్రయోజనాలు దాగున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

రాఫెల్ ఒప్పందంలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని, ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు లబ్ధి చేకూర్చేందుకే విమానాల ధరల్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమాంతం పెంచిందని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న విషయం విదితమే.