కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్ గాలం !

కూటమి ఏర్పాటు చేసిన అధికారంలోకి రాలేకపోయామని ఒక వంక మదన పడుతూ, మరో వంక కనీసం శాసనసభలో ప్రతిపక్ష నేత పదవిని కైవసం చేసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతుండగా, 119 మంది సభ్యులలో 90 మంది సభ్యులు తమతో ఉన్నా సంతృప్తి పడకుండా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయడం కోసం టీఆర్‌ఎస్ కుతంత్రాలకు పాల్పడుతున్నట్లు వినవస్తుంది. కాంగ్రెస్ గెలుపొందిన 19 మందిలో సగం మందిని వరకు ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పుకోలేందుకు మంత్రాంగం నడుపుతున్నట్లు చెబుతున్నారు. 

టీఆర్‌ఎస్ పార్టీకి 88 సీట్లు లభించగా, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినా ఇద్దరు కూడా చేరడంతో ఆ పార్టీ బలం 90కు పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లభించాలి అంటే కనీసం 12 మంది సభ్యులు ఉండాలి. అందుకనే కనీసం ఏడుగురిని తమవైపుకు తిప్పుకొంటే కాంగ్రెస్ కు అటువంటి హోదా లభించకుండా చేయవచ్చని ఎత్తుగడగా కనిపిస్తున్నది. అందులో ప్రయత్నంగా ఇప్పటికే 9 మంది ఎమ్యెల్యేలఫై వల విసురుతున్నట్లు తెలుస్తున్నది. 

ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఇదే తొలిసారి కానున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 సార్వత్రిక ఎన్నికల్లో  ఎన్టీయార్ నేతృత్వంలోని టీడీపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలు మాత్రమే దక్కడంతో అప్పడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీయార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాను ఇస్తామని ప్రకటించి, ఇచ్చారు కూడా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం తప్పకుండా ఉండాలని అప్పుడే ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందని ఎన్టీయార్ హుందాగా ప్రకటించారు.

 కానీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దానితో గెలుపొందిన 19 మంది ఎమ్యెల్యేలను కాపాడు కోవం ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు అగ్ని పరీక్షగా మారింది. 100 మంది ఎమ్యెల్యేలతో అసెంబీలోకి అడుగు పెడతానని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంకేతం ఇవ్వడంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతలలో అలజడి ప్రారంభమైనది. తమ ఎమ్మెల్యేలను ఎలాకాపాడు కోవాలి అనే అంతర్మనధంలో పడ్డారు. 

ఎన్నికల్లో గెలిచిన 88 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తోడు పార్టీలో చేరిన ఇద్దరు స్వతంత్రులు, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే మొత్తం 97 మంది శాసనసభ్యులు అధికారపక్షం వైపే ఉన్నారు.

మరోవంక  కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిలో దాదాపు 12 మంది సభ్యులు తమతో కలవడానికి ఇప్పటికే రాయబారాలు పంపారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏ క్షణమైనా కనీసం 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణకు తొందర పడాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్లుచెబుతున్నారు.