రఫెల్ పై రాద్ధాంతం చేసిన రాహుల్ క్షమాపణ చెప్పాలి

రఫేల్ ఒప్పందంపై రాద్ధ్దాంతం చేసిన  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ డిమాండ్  చేశారు. రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదంటూ కేంద్ర ప్రభుత్వానికి  సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా..  కాంగ్రెస్ తన ఆరోపణలు కొనసాగించడంతో..  బీజేపీ ఎదురు దాడికి  దిగింది.  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. 

రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ  నెలల తరబడి  రాహుల్ గాంధీ అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేశారని ఫడ్నవిస్  హైదరాబాద్ లో ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అసభ్యంగా విమర్శలు చేశారని, ఈ ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా రాహుల్ గాంధీ అవే ఆరోపణలను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్ని రోజులు దేశ రక్షణపై రాజీ పడిన కాంగ్రెస్, ఇప్పుడు అంతర్జాతీయంగా దేశానికి అప్రతిష్ట కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని ఫడ్నవిస్ ఆరోపించారు. 

కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత పాకిస్థాన్, ఛైనా ఒకేసారి మన దేశంపై యద్ధానికి  దిగితే తిప్పికొట్టేందుకు మన దగ్గర కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లేవని తేలిపోయిందని పఢ్నవిస గుర్తుచేశారు. రఫేల్ ఒప్పందం వల్ల ఆధునిక హంగులు, అత్యున్నత సాంకేతిక యుద్ధ విమానాలు పొందుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా టెండర్ల ప్రక్రియ జరిగినా 2011 వరకూ కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం వాటిని తెరిచి చూడలేదని గుర్తు చేశారు. 

అప్పట్లో దేశ రక్షణ కోసం నిధులు కూడా లేవని, కాంగ్రెస్ ముఖ్యనేత ఏకే ఆంటోని వెల్లడించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ ఒప్పందం జరిగినా.. మధ్యవర్తులు, దళారులు ఉండేవారనంటూ బోఫోర్స్ తదితర ఒప్పందాలను ఆయన ప్రస్తావించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ కంబాట్ విమానాల ఆవశ్యకత, అవసరాన్ని గుర్తించారని, ఆ తరువాత ప్రాన్స్, భారత ప్రభుత్వాల మధ్య 2016లో ఒప్పందం కుదిరిందని తెలిపారు. 

2019 నుంచి దేశానికి  రఫేల్ ఆధునిక యుద్ధ విమనాలు అందుబాటులోకి వస్తాయని ఫడ్నవిస్ తెలిపారు. దళారులు లేకుండా ఒప్పందం కుదరడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అందుకే  రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారానికి రాహుల్ గాంధీ దిగారని ఆయన ఆరోపించారు. కాగా,  యూపీఏ హయాంలో తీసుకున్న పాలసీ ప్రకారమే ఒప్పందం జరిగిందంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

 రిలయన్స్ కంపెనీని భాగస్వామ్యంగా ఎంచుకున్న అంశంపై కూడా ఫ్రాన్స్ చెందిన డసోల్ సంస్థకు ఆ స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పారు. ధర అంశంలో కూడా కోర్టు లోతుగా పశీలించిందని, సుప్రీం తీర్పుతో కాంగ్రెస్ అబద్ధాల పరదా తొలిగిపోయిందని తెలిపారు.

 మీ హయాంలో టెండర్లు దాఖలైనా.. ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని రాహుల్ కు ఆయన సవాల్ విసిరారు. మధ్యవర్తులు, దళారులు లేరన్న కారణంతో నిర్ణయం తీసుకోలేదా..? అని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని నిలదీశారు. 

 సుప్రీం తీర్పును జేపీసీ ఓవర్ రూల్ చేయలేదు కాబట్టే.. జేపీసీ వేయడం అనవసరమని చెప్పారు.  తమకు అనుకూలంగా వస్తేనే ఆ వ్యవస్థను కాంగ్రెస్ మంచిదిగా భావిస్తుందని, లేని పక్షంలో వ్యవస్థలపై బీజేపీ ఒత్తిడి పెంచుతోందని అంటారని ఫడ్నవిస్ విమర్శించారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  

రఫేల్ అంశంలో కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారంపై రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మంగళవారం కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. రాష్ట్రపతికి అందించే వినతి పత్రాలను ఎక్కడికక్కడ జిల్లాల్లో కలెక్టర్లకు అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.