మాల్దీవులకు రూ.10 వేల కోట్ల భారత్ సాయం

చైనా రుణ భారం నుంచి రక్షించేందుకు మాల్దీవులకు రూ.10.02 వేల కోట్ల (1.4 బిలియన్ డాలర్ల) ఆర్ధిక సాయం అందజేస్తామని భారత్ ప్రకటించింది. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్ చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ సోలిహ్.. రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ లక్ష్యంగా సోమవారం ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. 

ఈ మేరకు నాలుగు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. హిందూ మహా సముద్ర ప్రాంత పరిధిలో భద్రతా రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య సులభమైన వీసాల జారీ ప్రక్రియ కల్పించడంతోపాటు సంస్కృతి, అగ్రి బిజినెస్, ఐటీ రంగాల్లో పరస్పరం సహకారం కోసం ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా సోలిహ్‌తో కలిసి మోదీ మీడియాతో మాట్లాడుతూ మాల్దీవులలో శాంతి, అభివృద్ధి సాధనకు భారతదేశం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. గత నెల 17న మాల్దీవుల అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మహ్మద్ సోలిహ్ వెంటనే ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం భారత్ పర్యటనకు రావడం గమనార్హం. సోలిహ్ మాట్లాడుతూ తమది ఇండియా-ఫస్ట్ పాలసీ అని పేర్కొన్నారు. 

ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతునిస్తామని తెలిపారు. అంతకుముందు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సోలిహ్ చర్చలు జరిపారు.