మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఇలా జరగదు

మధ్యప్రదేశ్‌లో రైతులకు రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ వల్లే ఆ పార్టీ విజయం సాధించిందని, కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఇలా జరగదని, ప్రజలు బిజేపికే ఓట్లు వేస్తారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమకు ప్రజలు మద్దతు తెలిపేలా చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. 

‘మాకు ఓట్ల శాతం కాంగ్రెస్‌ కన్నా ఎక్కువగా వచ్చింది. కానీ 109 సీట్లే వచ్చాయి. మేము ఈ ఫలితాలపై సమగ్రంగా సమీక్షిస్తున్నాం. ముఖ్యమంత్రిగా నేను చాలా అభివృద్ధి పనులు చేశాను. కానీ, ఇంకా ఏదో చేయలేదన్న భావం ఉంది. రైతు రుణమాఫీ హామీయే కాంగ్రెస్‌ని గెలిపించింది'అని చెప్పకొచ్చారు. 

అయితే ఈ హామీ ప్రభావం కొన్ని చోట్ల పనిచేయలేదని తెలిపారు. రైతుల ఉద్యమాలు ఉధృతంగా జరిగిన మందసౌర్‌లో ఉన్న నాలుగు స్థానాల్లో మూడింటిలో గెలిచామని, ఓ స్థానంలో కేవలం 300 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. అలాగే, నీముచ్‌లోని నాలుగు స్థానాల్లోనూ తామే  విజయం సాధించామని పేర్కొన్నారు. మందసౌర్‌లో 2017లో దురదృష్టవశాత్తు కాల్పులు (రైతులపై) చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు.

‘ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపి రైతు రుణమాఫీ హామీని ఇచ్చి గెలిచింది. కానీ, రాష్ట్రంలో రైతులు తమ కష్టార్జితానికి తగ్గట్లు పూర్తిగా ఫలితం రావాలని కోరుకుంటున్నారు. మరేది కోరుకోవట్లేదు. అందుకే మేము మధ్యప్రదేశ్‌లో ఆ హామీని ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా నేను రైతుల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టాను'అని శివరాజ్ తెలిపారు. 

`ముఖ్యమంత్రి కృషక్‌ సమృద్ధి యోజన పథకం చిన్నకారు రైతులు చాలా లాభం పొందారు. కాంగ్రెస్‌ రైతు రుణ మాఫీ చేస్తామని మాత్రమే తెలిపింది. కానీ, మేము మరోసారి అధికారంలోకి వస్తే పలు పథకాల ద్వారా అందుకు రెట్టింపు ప్రయోజనాలను రైతులకు అందించేవాళ్లం’ అని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు.

‘ఈ ఫలితాల ప్రభావం మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పడదు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల్లో చాలా నమ్మకం ఉంది. శాసనసభ ఎన్నికలపై ఫలితాలపై నేను చేసిన విశ్లేషణ ప్రకారం రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మేము బలంగా ఉన్నాము. మరిన్ని స్థానాల్లో మేము బలపడతాం. 29కి 29 స్థానాల్లో మేము విజయం సాధించాలన్నదే నా లక్ష్యం' అని వెల్లడించారు. 

2014 ఎన్నికల్లో 29కి 27 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఆ పనితీరుని మళ్లీ ప్రదర్శిస్తాం. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించారు \. ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని బట్టి ఈ ఎన్నికలు ఫలితాలు ఉంటాయని అంటూ  శాసనసభ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు పోలికలేదని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు.