మూడో టెస్టులో భారత్‌ ఘనవిజయం

ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఘోరంగా ఓటమి చెందిన భారత్ జట్టు మూడో టెస్టులో మాత్రం ఘనవిజయం సాధించింది. 311/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 17 బంతుల్లోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో  ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 317 పరుగులకు ముగియడంతో కోహ్లిసేన 203 పరుగుల భారీ విజయాన్నందుకుంది.

చివరి వికెట్‌గా అండర్సన్‌ (11)ను అశ్విన్‌ ఔట్‌ చేయగా, ఆదిల్‌ రషీద్‌ (33) నాటౌట్‌గా నిలిచాడు. నాలుగో రోజే భారత్‌ గెలిచేందుకు బాగా చేరువైనా ఆదిల్‌ రషీద్‌ (55 బంతుల్లో 30 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, ఒక సిక్స్‌) పట్టుదలగా ఆడటంతో చివరి రోజు ఆట ఆడక తప్పలేదు.  భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు పాండ్యా, అశ్విన్‌, షమీలు తలో వికెట్‌ తీశారు. 

ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్ కోహ్లి కీ లక ఇన్నింగ్స్‌లకు, రహానే, పుజారాలు తోడవ్వడంతో ఇంగ్లండ్‌కు 521 పరుగుల భారీ లక్ష్యం నమోదైన విషయం తెలిసిందే. ఇక బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్‌ పాండ్యా, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లతో చేలరేగడంతో  భారత విజయం సులువైంది. బట్లర్ (106) సెంచరీ, స్టోక్స్ (62) హాఫ్ సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు.

రెండో టెస్టులో సమిష్టిగా విఫలమై మూల్యం చెల్లించుకున్న భారత్‌ ఈ మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతోనే విజయాన్ని నమోదు చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో 2-1తో ఇంగ్లండ్‌ ఆధిక్యంలో ఉంది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(97, 103)కి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరించింది. సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది.