రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ప్రతిపక్షాలలో కలకలం !

తండ్రి కరుణానిధి విగ్రహ అవ్విష్కరణ సందర్భంగా పలువురు ప్రతిపక్ష నేతల సమక్షంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని వచ్చే ఎన్నికలలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించడం ప్రతిపక్ష శిబిరంలో కలకలం రేపుతున్నది. ఒకటి, రెండు సందర్భాలలో ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తే తాను ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించినా, ఈ విషయమై తర్వాత కాంగ్రెస్ పార్టీ మౌనం వహిస్తున్నది. పైగా రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా తాము ప్రతిపాదించడం లేదని అంటూ ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం స్పష్టత ఇచ్చారు కూడా. 

బిజెపికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నా కాంగ్రెస్ నాయకత్వంలో ఒక కూటమి ఏర్పాటుకు మాత్రం ముందుకు రావడం లేదు. సీట్ల సర్దుబాట్లు, పొత్తులు కూడా రాష్ట్రాల స్థాయిలో ఉండాలని, ఒకొక్క రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ సారధ్యంలో జరగాలని ప్రతిపాదిస్తున్నాయి. ఎన్నికల అనంతరం గెలుపొందిన ఎంపీలు కలసి కూటమి  ఏర్పాటు, ప్రధాన మంత్రి అభ్యర్థి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఆ విధంగా చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల ఒక విధంగా విముఖత వ్యక్తం చేస్తున్నాయి. 

2019 ఎన్నికలలో అటు బిజెపికి, ఇటు కాంగ్రెస్ కు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం సమకూరడని, అటువంటప్పుడు 40 నుండి 50 మంది వరకు యంపీల మద్దతు కూడదీసుకోవడం ద్వారా కాంగ్రెస్ లేదా బీజేపీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ ఎవ్వరికీ వారు అంచనాలు వేసుకొంటున్నారు. మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవర్, ములాయం సింగ్ యాదవ్ వంటి నేతలంతా ఆ విధంగా ప్రధాన మంత్రి పదవిపై కన్ను వేశారు. అందుకనే రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. 

గతవారం 10న ఢిల్లీలో జరిగిన సమావేశంలో 21 పక్షాల ప్రతినిధులు హాజరైనా కీలకమైన మాయావతి, అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదు. పైగా కూటమి ఏర్పాటు గురించి పెద్దగా చర్చించనే లేదు. కేవలం పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించ వలసిన ఉమ్మడి వ్యూహంపై దృష్టి సారించారు. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రస్  `పెద్దన్న' ధోరణి ప్రదర్శించిందని ఆగ్రహంతో బీఎస్పీ సొంతంగా పోటీ చేయడంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. అయితే కమలనాథ్ సమాలోచనలు జరపడంతో ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు మాయావతి మద్దతు ప్రకటించారు. 

అయితే సోమవారం జరుగనున్న ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమాలకు మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత కారణాల వల్లన హాజరు కాలేక పోతున్నట్లు మమతా బెనర్జీ తెలిపినా, మిగిలిన ఇద్దరు ఎటువంటి కారణం తెలుపలేదు. ఈ ముగ్గురు నేతలు కలసి సుమారు 100 సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన పక్షాలలో డీఎంకే మినహా 25 నుండి 30 సీట్లు గెల్చుకోగల మరో ప్రతిపక్షం లేదు. అందుచేత ఈ మూడు పక్షాలు లేకున్నా రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవి చేపట్టడం ఇష్టం లేదు. 

ఇటువంటి సమయంలో స్టాలిన్ అనూహ్యంగా రాహుల్ గాంధీ పేరును ప్రధాన మంత్రి పదవికి ప్రతిపాదించడం ఇతర ప్రతిపక్షాలలో అసహనానికి దారితీస్తుంది. కాంగ్రెస్ కు మిగిలిన ప్రతిపక్షాలను దగ్గరగా చేర్చడం కోసం కష్ట పడుతున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహితం ఇప్పటి వరకు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా పేర్కొనక పోవడం గమనార్హం. 

వాజపేయి సారథ్యంలోని ఎన్‌డిఏ కూటమిని ఎదుర్కొనేందుకు యూపీఏ సారథిగా 2004లో సోనియా గాంధీ పేరును, 1980లో ఇందిరా గాంధీ నాయకత్వాన్ని తన తండ్రి కరుణానిధి బలపరిచిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకనే ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ నాయకత్వంలోనే బీజేపీ వ్యతిరేక కూటమి ఎన్నికల్లో పోరాడుతుందని తెలిపారు. రాహుల్ సారథ్యంలో నవభారతాన్ని నిర్మిస్తామని, దేశానికి సుపరిపాలన అందిస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. కానీ వామపక్షాలతో సలహా మిగిలిన ప్రతిపక్షాలు ఏవీ స్టాలిన్ అభిప్రాయాలను బలపరచడం లేదు.