బాబుకు ఓటమి భయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందా..? వచ్చే ఎన్నికలలో తన ఓటమి తథ్యమనే సంకేతాలు అందాయా.?ఇటీవలి చంద్రబాబు నాయుడు మాటలు చేతలు చూస్తేంటే ఈ ఓటమి భయం వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు వెళ్లిన ప్రతిచోట ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడం ఆయన పదేపదే జగన్ పై విరుచుకుపడడం ఆయనలోని భయాన్ని తెలియజేస్తున్నాయి. దీనికి తోడు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబులో గూడు కట్టుకున్న ఆందోళనను చెప్పకనే చెబుతున్నాయి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచి చంద్రబాబు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని - చంద్రబాబును దగ్గరగా గమనిస్తున్న వారంటున్నారు. గురువారం నాటి మంత్రివర్గ సమావేశ వివరాలను ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ వెల్లడించడం చంద్రబాబులోని భయాన్ని తెలియజేస్తోంది. నిజానికి మంత్రివర్గ నిర్ణయాలను పత్రికలకు వెల్లడించే బాధ్యత సమాచారశేఖ మంత్రులది. ఏ రాష్ట్రంలోనైన కేంద్రంలోనైన ఇదే ఆనావాయితీగా కొనసాగుతోంది. మరీ ముఖ్యమైన అంశాలుంటే తప్ప ముఖ్యమంత్రులు - ప్రధాని వంటి వారు ఈ సమావేశంలో పాల్గొంటారు. కాని ఇందుకు విరుద్దంగా గురువారం నాడు మంత్రి వర్గ సమావేశ కీలక నిర్ణయాలను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆయన ప్రక్కన రాష్ట్ర సమాచార శాఖా మంత్రి కాలువ శ్రీనివాసులు ఉన్నా విలేకరులతో మాట్లాడింది మాత్రం నారా లోకేషే. ఇది కొత్త సంప్రాదాయానికి తెర తీసినట్లైంది. నిరుద్యోగులకు ప్రతినెల భ్రుతి ఇవ్వాలనే నిర్ణయంతోనే చంద్రబాబులోని ఆందోళన బహిర్గతమవుతోంది. మరోవైపు వైఎస్ ఆర్ సిపీ నాయకుడు జగన్ పాదయాత్రకు వెల్లువెత్తుతున్న ప్రజానీకం కూడా చంద్రబాబును కలవరపరుస్తున్నట్లు తెలుస్తోంది. జగన్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం రాజకీయ పరిణితితో ఆయన వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడకు ఏమంత కలసి రావటంలేదు. బిజేపికి వ్యతిరేకంగా కూటమి కడుతున్న పార్టీలు ముఖ్యంగా మమతా బెనర్టీ తెలుగుదేశం నేత చంద్రబాబును సంప్రదించడం లేదు. తన ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియ గాంధీ - రాహుల్ గాంధీలను కలుస్తున్నారే తప్ప చంద్రబాబును పట్టించుకోవడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పదేపదే ఢిల్లీలో ప్రధానిని - హైదారబాదులో గవర్నర్ ను కలుస్తున్నారు. ఇది కూడా మింగుడుపడటం లేదు. ఈ పరిణామాలతో చంద్రబాబు నాయుడు కలత చెందుతున్నట్టు సమాచారం.