రక్షణ ఒప్పందాల్లో ‘ఖత్రోచి మామా’, ‘క్రిస్టియన్‌ మిచెల్‌ అంకుల్‌’ లేరనే ...

తన ప్రభుత్వ రక్షణ ఒప్పందాల్లో ‘ఖత్రోచి మామా’, ‘క్రిస్టియన్‌ మిచెల్‌ అంకుల్‌’ లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తోందని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాలపై మొదటిసారిగా విరుచుకు పడుతూ దేశ న్యాయ వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, రాఫెల్ ఒప్పందంపై  కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ `క్లీన్ చిట్' ఇచ్చిన తర్వాత మొదటిసారిగా బహిరంగ సభలో మాట్లాడుతూ గత కొద్దీ నెలలుగా రాఫెల్ ఒప్పందం గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై మొదటిసారిగా నిశితంగా విమర్శలు గుప్పించారు. పైగా యుపిఎ అధినేత్రి  సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడటం ద్వారా ఒక విధంగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. 

 భారత సైనిక దళాలు పటిష్ఠం కావడం కాంగ్రెస్‌ పార్టీకి అస్సలు ఇష్టం లేదని ప్రధాని ధ్వజమెత్తారు. కొందరు కేవలం అబద్దాలు మాత్రమే నమ్మి వాటినే ప్రజలతో పంచుకుంటారని రామ్‌చరిత మానస్‌లోని ఉదాహరణలిచ్చారు. 

‘ఆ కొద్దిమందికీ రక్షణ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రి, భారతీయ వాయుసేన, ఫ్రాన్స్‌ ప్రభుత్వం అన్నీ అసత్యాలుగానే కనిపిస్తాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు సైతం అబద్ధం చెప్పినట్టే వారికి కనిపిస్తోంది’ అని కాంగ్రెస్‌ నాయకులను ఉద్దేశించి మోదీ అన్నారు. కాంగ్రెస్‌ ఒప్పందాల్లో మాత్రం ఖత్రోచి మామ (ఇటలీ వ్యాపారి) కనిపిస్తారని విమర్శించారు. 

ప్రధాని రాజీవ్‌ గాంధీ 1986లో చేసుకున్న బోఫోర్స్‌ ఒప్పందంలో ఖత్రోచి మధ్యవర్తి అని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ చాపర్‌ కేసును ఉదహరిస్తూ ‘కొద్ది రోజుల క్రితం మేం క్రిస్టియన్‌ మిచెల్‌ అంకుల్‌ను భారత్‌కు తీసుకొచ్చాం’ అని మోదీ వెల్లడించారు. రూ.3,600 కోట్ల అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్‌ నాయకులు, అధికారులకు లంచాలు ఇవ్వజూపారని మిచెల్‌ను విచారిస్తున్నారు.

‘ప్రతి ఒక్కరూ నిందితుడి (క్రిస్టియన్‌ మిచెల్‌)ని రక్షించాలనే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ తన లాయర్‌ను న్యాయస్థానానికి పంపించింది. కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అదే పనిగా ఆందోళనలు చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తోందని ప్రశ్నిస్తున్నా. భాజపా రక్షణ ఒప్పందాల్లో ఖత్రోచి మామా, క్రిస్టియన్‌ అంకుల్‌ లేనందుకేనా? న్యాయ వ్యవస్థపై విశ్వసనీయత పోగొట్టాలనా?’ అని మోదీ ప్రశ్నించారు. 

కార్గిల్‌ వివాదాన్ని ఉటంకిస్తూ ప్రధాని ఆధునిక యుద్ధ విమానాల ఆవశ్యకత ఉందని చెప్పారు. ‘కాంగ్రెస్‌ పదేళ్లు దేశాన్ని పరిపాలించింది. వైమానిక దళం పటిష్ఠం అయ్యేందుకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు? ఎవరి ఒత్తిడి మేరకు? 2009లో భారత సైన్యం 1.86 లక్షల బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కావాలని అడిగింది. యూపీఏ-2 ఐదేళ్ల పాలనలో ఒక్కటీ కొనుగోలు చేయలేదు. మేం అధికారంలోకి రాగానే 2016లో 50,000 జాకెట్లు కొనుగోలు చేశాం. ఈ ఏడాది స్వదేశీ కంపెనీ నుంచి 1.86 లక్షల జాకెట్లు ఆర్డరిచ్చాం’ అని మోదీ తెలిపారు.

రాయ్‌బరేలి ప్రాంతానికి ఆ పార్టీ చేసిందేమీలేదంటూ పరోక్షంగా సోనియా గాంధీని విమర్శించారు. రాయ్‌బరేలిలో మోడరన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మించే క్రమంలో 5000 మంది ఉద్యోగులను నియమించాలని నిర్ణయించగా కేవలం అందులో సగానికి మాత్రమే కాంగ్రెస్‌ హయాంలో నియామకాలు జరిగాయని ధ్వజమెత్తారు. 2014లో ఫ్యాక్టరీలో కొత్తగా ఎవరినీ రిక్రూట్‌ చేసుకోలేదని చెప్పారు. మోదీ తన పర్యటనలో భాగంగా మోడరన్‌ కోచ్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీలో తయారైన 900వ కోచ్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.