ఎప్పటికి సీఎం గానే శివరాజ్ సింగ్ !

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ అధికారంలో ఉన్న బిజెపి  ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీంతో  13 ఏళ్లుగా అధికారంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌  ముఖ్యమంత్రి  గద్దెను దిగాల్సి వచ్చింది. పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా కూడా చేశారు.

 అయితే ఆయన శనివారం ట్విటర్‌ ఖాతాలో ఓ మార్పు చోటు చేసుకుంది. ఇన్నిరోజులు ఆయన పేరు కింద ‘ఛీఫ్ మినిస్టర్‌ ఆఫ్ మధ్యప్రదేశ్‌’ అని ఉండేది. ఇప్పుడు ఆయన దాన్ని ‘కామన్‌ మ్యాన్ ఆఫ్ మధ్యప్రదేశ్‌’ గా మార్చారు. దాంతో షార్ట్‌కట్‌లో ఆయన ఇంకా ‘సీఎం’ అనే అర్థం వస్తుంది. 

 మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఆలయం లాంటిదని, ప్రజలే దేవుళ్లని అని సొంతగడ్డమీద తనకు ఉన్న అభిమానాన్ని ట్విటర్‌ వేదికగా చాటుకున్నారు. ‘మధ్యప్రదేశ్‌ నా ఆలయం, ఇక్కడి ప్రజలు దేవుళ్లు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ఎటువంటి జంకూ గొంకూ లేకుండా నా దగ్గరికి రావొచ్చు. ఎప్పటిలాగే వారికి సహకరిస్తాను’ అని తన ట్విటర్‌ ఖాతాలో రాసుకున్నారు.

ఎన్నికల్లో ఓటమి అనంతరం గత బుధవారం ఆయన గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. ఆ సందర్భంగా రాజ్‌భవన్‌ ఎదుట మాట్లాడుతూ..‘ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. ప్రస్తుతం కాపలాదారుడి పాత్ర పోషించడమే నా కర్తవ్యం’ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో 230 సీట్లకు గానూ బిజెపి  109 స్థానాలు సాధించి, అధికారాన్ని చేజిక్కించుకొనే అవకాశాన్ని తృటితో చేజార్చుకుంది. 114 స్థానాలు గెలుచుకొన్న కాంగ్రెస్‌.. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్ర సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

మరోవంక ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినా రాష్ట్ర రాజకీయాల నుండి దూరం కాబోనని, కేంద్ర రాజకీయాలకు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే ఉంది ప్రజాసేవ చేస్తూ గడుపుతానని వినమ్రంగా పేర్కొన్నారు.