విభజన చట్టంలో హోదా ప్రస్తావనే లేదు

రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేసారు. తాడేపల్లిగూడెంలో పీఎంఆర్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన "ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు-పరిష్కారాలు" అంశంపై చర్చాగోష్ఠిలో పాల్గొంటూ పునర్విభజన చట్టం సెక్షన్ 94లో 2 రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సహాయం ఇవ్వడానికి అంగీకరించనట్లుగా ఉందని చెప్పారు. 

విభజన చట్టంలో హామీలు కేంద్రం అమలు చేయడంలేదని అనడంలో అర్ధం లేదని అంటూ రాష్ట్రంలో 7 జిల్లాలు గుర్తించి 3 సంవత్సరాలకు రూ. 350 కోట్లు చొప్పున ఇచ్చారని, 4వ సంవత్సరంలో కేంద్రం వెనక్కి తీసుకుందని, యూసీ ఇచ్చాక వెనక్కి ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఆర్థిక సహాయం కింద స్పెషల్ కేటగిరి ఇస్తామని చెప్పారని తెలిపారు. ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ కింద రూ. 5 వేల కోట్లు ఇస్తామని చెప్పారని, రూ. 16,500 కోట్లు నాబార్డు నుంచి ఇవ్వమని రాష్ట్రం అడిగిందని, దాని ప్రకారమే రూ. 12500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చిందని వివరించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు అంగీకరించి తరువాత రాజకీయ వ్యూహంతో వద్దని చెప్పడం జరిగిందని విమర్శించారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్తామన్న వాటిని ఎందుకు తీసుకోవడంలేదని ఏ రాజకీయ పక్షాలు ప్రశ్నించడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.  ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు తమకెందుకు ఇవ్వలేదనే వాదన ప్రజల్లో ఉందని చెప్పారు. అయితే ఇస్తున్న నిధులను 42 శాతానికి పెంచి వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తున్న ఆర్థిక సహాయం గురించి ప్రజలకు అర్ధం కావడంలేదన్నారు. 

14వ ఆర్థిక సంఘం నిర్ణయించినట్లుగా రూ. 4117 కోట్లు రాష్ట్రానికి ఇస్తామని కేంద్రం ప్రకటించిందని చెబుతూ నేడు మారిన రాజకీయ సమీకరణాల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి ద్రోహం చేసినట్లుగా పాలకులు చెప్పడం దారుణమని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, వాటికి సీఎం వత్తాసు పలుకుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఏ రకంగా ఇస్తారో రాహుల్ స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు. 

 తనకున్న పరిజ్ఞానంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా జరిగే పనికాదని కృష్ణారావు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతాయని అంటూ చాలామంది మేథావులు కేంద్రం చేస్తున్న ప్రకటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదనడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను మరింత పేద రాష్ట్రంగా చెప్పవలసిన పనిలేదని స్పష్టం చేశారు. 

 2015 డిసెంబరు నాటికి రాష్ట్ర ఆదాయం మెరుగ్గా ఉందని చెబుతూ  రాష్ట్రంలో మీడియా అంతా ఒకవైపు ఉండటం వల్ల ప్రజలకు నిజం తెలియడంలేదని విచారం వ్యక్తం చేశారు.  పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చిన అంశాలు కూడా ప్రజలకు చూపించే పరిస్థితి లేదని అంటూ తటస్థ మీడియా లేకపోవడంతో ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఐఏఎం, నిట్ వంటి విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ కోరలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు గుర్తించి విద్యావ్యాప్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీలో వాటిని ఏర్పాటు చేసిందని కృష్ణారావు తెలిపారు. 

స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి  పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాటలు ఉన్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కుదరని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెబుతూ హోదా కన్నా ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు కేంద్రంపై నిందలు మోపుతూ హోదా కావాలని పోరాట దీక్షలు చేయడం సిగ్గుచేటని విమరిశలు.  రాష్ట్రానికి, పోలవరానికి కేటాయించిన నిధులు లెక్కలు చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.