కాశ్మీర్ లో బీజేపీ కార్యకర్త దారుణ హత్య

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. బీజేపీ కార్యకర్త షబీర్ అహ్మద్ భట్‌ను దారుణంగా హత్య చేశారు. రఖ్-ఇ-లిట్టర్ గ్రామంలోని షబీర్ నివాసంపై ఇవాళ తెల్లవారుజామున దాడిచేసిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.

కాగా షబీర్ అహ్మద్ హత్యపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ‘‘పిరికిపందల చర్య’’ అనీ ఆయన దయ్యబట్టారు. అయితే ఆ కార్యకర్త త్యాగం వృధాగా  పోదని స్పష్టం చేసారు.

ఆయన ట్విటర్లో స్పందిస్తూ. ‘‘ బీజేపీ కార్యకర్త షబీర్ అహ్మద్ భట్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోవడం తీవ్రంగా కలచివేసింది. ఈ హత్య పిరికిపందల చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న కశ్మీర్ యువతను ఉగ్రవాదులు ఏమాత్రం అడ్డుకోలేరు. ఈ హింస ఇకపై కొనసాగడానికి వీల్లేదు..’’ అని పేర్కొన్నారు. షబీర్ అహ్మద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.