తెలంగాణలో బిజెపి ఓటమిపై 24పై అమిత్ షా సమీక్ష

తెలంగాణలో అంతకు ముందున్న ఐదు సీట్లను కాపాడుకొంటూ కనీసం మరో పది సీట్లలో గెలుపొందడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర వహించాలని భావించిన బిజెపి నేతలకు ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. 118 సీట్లలో పోటీ చేసి, ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. 

అయితే కేవలం ఒక్క సీట్ గెలుపొందటమే కాకుండా 103 చోట్ల ధరావత్తులను కూడా కోల్పోవలసి రావడం, తప్పక గెలుస్తారు అనుకున్న రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ వంటి వారు మూడో స్థానంకు పరిమితం కావడంతో ఒక విధంగా విస్మయానికి గురిచేశాయి. తెలంగాణలో 22 లక్షల మంది సభ్యులు ఉండగా 14.5 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. 

పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నా ఫలితాలు ఆశించిన రీతిలో లేకపోవడంతో రాజకీయ కారణాలతో పాటు సంస్థాగత లోపాలు సహితం ప్రధాన కారణాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఈ విషయమై లోతయిన సమీక్ష జరిపి, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పార్టీని సమాయత్తం చేయడం కోసం అమిత్ షా ప్రత్యేకంగా హైదరాబాద్ కు వస్తున్నట్లు తెలుస్తున్నది. 

లోక్‌సభ నియోజకవర్గాలతో కూడిన క్లస్టర్ల సమావేశాన్ని ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బిజెపి  నిర్వహిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై అమిత్‌షా దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాల్లో 14 చోట్ల పార్టీ బలహీనంగా ఉన్నట్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి చేశాయి. దానితో  ఇక్కడ పార్టీ బలం పెంచుకోవడం గురించి అమిత్ షా ప్రధానంగా మార్గదర్శనం చేయగలరని భావిస్తున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, విస్తృతంగా ప్రచారం చేయడం, పైగా కాంగ్రెస్ కు ఆర్ధిక వనరులు కూడా సమకూర్చడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గెలుపొందితే తిరిగి `అంధోవాళ్ళ' పాలన సాగుతుందని అంటూ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి కేసీఆర్ కు ఉపయోగ పడింది. దానితో తన ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మల్లించ గలిగారు. 

తెలంగాణ సెంటిమెంట్‌తోనే   టీఆర్‌ఎస్‌  విజయం సాధించిందని, ఉద్యమ సమయంలో కంటే ఈసారే ఎక్కువగా ఆ అంశం ప్రభావం చూపిందని బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు  డా కె లక్ష్మణ్‌ భావిస్తున్నారు. అందుకనే తమకు రావల్సిన ఓట్లు కూడా టీఆర్‌ఎస్‌కు వెళ్లాయని చెప్పారు.  ఓటమిపై సమష్టి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. 

కొన్నిచోట్ల ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉంది. ఈ విషయంలో కొంత అనుమానాలున్నాయని పార్టీ అభ్యర్థులు చెప్పారని పేర్కొంటూ ఈవీఎంల సాంకేతికతపై పార్టీలో కమిటీ వేసి చర్చించి పోరాటం చేస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. అట్లాగే  బీజేపీ ఓట్లు మాత్రమే జాబితాల నుండి గల్లంతు అయ్యాయని, వాటిపై విశ్లేషణ చేస్తున్నామని చెప్పారు. 

పార్టీ పరంగా, ముఖ్యంగా సంస్థాగతంగా నెలకొన్న పొరపాట్లను సరిదిద్దుకొని, లోక్ సభ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం కావించడం కోసం వ్యూహాత్మకంగా అమిత్ షా తగు ప్రణాళికతో హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక జనవరి నుండి లోక్ సభ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించవలసి ఉంది. జనవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణాలో ఒక బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.