6న గుంటూరులో ప్రధాని మోదీ సభ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 6వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఆ రోజున గుంటూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలం కోసం గుంటూరు నగరంలో నేతలు అన్వేషిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బిజెపి  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. 

జనవరి 6వ తేదీనే కేరళలో జరిగే పార్టీ కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధాని మోదీ రాక దృష్ట్యా పార్టీ జాతీయ స్థాయి నేతలు కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. టిడిపి  ఎన్డీఏ నుంచి వైదొలిగిన తరువాత, ఎన్నికల ఫలితాలు వెల్లడి అనంతరం మోదీ రాష్ట్రానికి రాబోతుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. 

విభజన హామీల అమలు, ఇతర అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగించ గలరని భావిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందుగా జరగబోతున్న బిజెపి  సభకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ ద్రోహం చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్రోహం చేశారని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని విజయనగరంలో స్పష్టం చేశారు. జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ముందుకు వస్తే వారు కమిషన్ ఇవ్వరని జిఎంఆర్‌కు కట్టాబెట్టాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసిందని ఆరోపించారు. 

కాగా, ఇక్కడ ఎంపీగా అశోక్‌గజపతిరాజు ఉన్నప్పటికీ దేనికి నోరు మెదపడం లేదని, అలాంటపుడు మంచివ్యక్తి అయితే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియాగాంధీ ఇద్దరూ ఆంధ్రులకు ద్రోహం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీలను చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కంటిమీద కునుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. 

ఇలా  ఉండగా, బీజేపీ ద్వారా కాపు రిజర్వేషన్ల కల సాకారం కాబోతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా శివనాగేంద్రరావు వెల్లడించారు.  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతల విజ్ఞప్తి మేరకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. కాపు రిజర్వేషన్ల అంశానికి పరిష్కారం లభిస్తే బిజెపికి మద్దతు తెలుపుతామని కాపు జేఏసీ కృష్ణా జిల్లా కన్వీనర్‌ మల్లెమూడి పిచ్చయ్య వెల్లడించారు.