జాతీయ భద్రత, రక్షణ రంగం కాంగ్రెస్‌కు ఆటవిడుపు

జాతీయ భద్రత, రక్షణ రంగం కాంగ్రెస్‌కు ఆటవిడుపు అని, అవి ఆ పార్టీకి నిధులు సమకూర్చే అంశాలని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించిందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రధాని వారిపై ప్రతిదాడికి దిగారు. 

తమిళనాడులోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ఓవైపు లక్షితదాడులను హేళన చేస్తున్నారు. మరోవైపు వారు 1940 నుంచి రక్షణ రంగాన్ని అడ్డం పెట్టుకొని లూటీకి పాల్పడుతున్నారు అని విమర్శించారు. 1940 దశకంలో జీపు కుంభకోణం నుంచి 80 దశకంలో బోఫోర్స్ కుంభకోణం వరకు, ఇంకా అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు, జలాంతర్గాముల కుంభకోణం కూడా వారి హయాంలోనే జరిగాయని ఆరోపించారు. 

మన సైనిక దళాల నైతిక స్థయిర్యం దెబ్బతింటున్నా సరే కాంగ్రెస్ నేతలు డబ్బు సంపాదనపైనే దృష్టి పెడుతారని పేర్కొన్నారు. మన భద్రతా బలగాలు దేశానికి గర్వకారణమని, వారిపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసముందని చెప్పారు. దేశానికి హాని చేసే వారిని ఎదుర్కొనేందుకు సైన్యానికి స్వేచ్ఛనిచ్చామని తెలిపారు. మనపై దాడి చేసిన వారికి దీటైన జవాబు లక్షిత దాడుల రూపంలో ఇచ్చామని గుర్తు చేశారు. లక్షిత దాడులు మన దళాల సామర్థ్యాన్ని చాటి చెప్పాయని తెలిపారు.

 సాయుధ దళాలకు ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ను తామే అమలు చేశామని చెప్పారు. దేశాన్ని, దేశంలోని 130 కోట్ల మంది పౌరులను కాపాడేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని తెలిపారు. మనది శాంతి దేశం. మన అభివృద్ధిని అడ్డుకొని, ప్రజలకు హాని చేసే సంఘ వ్యతిరేక శక్తులకు సరైన జవాబు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడబోము అని ప్రధాని స్పష్టం చేశారు.